ఆకాశమే హద్దుగా రైతుల పోరాటం.... దిగి వచ్చిన ప్రభుత్వం

Posted on : 13/03/2018 04:09:00 pm

ఇప్పటి వరకూ దేశంలో ఎన్నో ఉద్యమాలు చూశాం. విద్యార్థులు రోడ్డెక్కారు, కార్మికులు రోడ్డెక్కారు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి, మహిళా సంఘాలు తమ హక్కుల కోసం రోడ్డెక్కాయి కానీ మొదటి సారి రైతన్న రోడ్డెక్కడం చూస్తున్నాం. 

మహారాష్ట్రలో ఆరు రోజులుగా రైతులు పాదయాత్ర చేపట్టి ముంబాయికి చేరుకున్నారు. ఈ నెల 6న సీబీఎస్ చౌక్ నుంచి కొద్ది మందితో ప్రారంభమైన పాదయాత్ర ముంబాయి చేరుకునే సరికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సుమారు యాభై వేలమందికిపైగా పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యారు.  ఆరు రోజులుపాటు సుమారు 200 కిలోమీటర్లు కాలినడకన మండుటెండలో నాసిక్ నుంచి ముంబాయికి రైతులు చేరుకున్నారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమ పంటలకు మరింత మెరుగైన ధర ఇవ్వాలని, తమ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని, పూర్తి రుణమాఫీ, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

సుదీర్ఘ పాదయాత్రలో నెత్తురు ధారపోసి అసెంబ్లీ ముట్టడి అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు అంగీకారం తెలపడంతో మహారాష్ట్ర రైతులు విజయాన్ని సాధించారు.  మొదట్లో ఇది మీడియాకు, పత్రికలకు పెద్ద వార్తగా కనిపించలేదు. ఈ వార్తలను  చాలా పత్రికలు లోపలి పేజిల వరకే పరిమితం చేశాయి. ముంబాయికి ప్రారంభమైన రైతుల మార్చ్‌ అని సింపుల్ గా ప్రచురించాయి. అయితే, పాదయాత్ర జరిగే క్రమంలో వెల్లువల్లా వస్తున్న జనప్రభంజనంతో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా తమ నిర్లక్ష్యభావాన్నివదులుకోక తప్పలేదు.

నాసిక్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఆరురోజుల పాటు 200 కిలోమీటర్ల దూరం నడిచిన అనంతరం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన రైతాంగం ముంబాయి మహానగరంలోకి వెల్లువలా ప్రవేశించడంతో ప్రఖ్యాతి గాంచిన జెజె ఫ్లైఓవర్‌ పై ఏదైనా పదాతి దళం భారత దేశ ఆర్థిక రాజధానిని ముట్టడించడానికి వచ్చాయా? అనిపించింది. ముంబాయి జనజీవన స్థంభించిపోతోందేమో నన్న అనుమానంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగడకూడదన్న ఉద్దేశంతో  మహా పాదయాత్రను నిర్వహించిన అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు ఆజాదీ మైదాన్ కు అర్థరాత్రి నుండి నడక ప్రారంభించి తెల్లవారాక గమ్యాన్ని చేరుకోవడంతో విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రైతులను సమీకరించడానికి ఈ ఏర్పాట్లకు 2 నెలల సమయం పట్టిందని ఎంతో వ్యయ ప్రయాసకోర్చినట్లు తెలిపారు. 

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని మరిపించేలా ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా ప్రజానీకాన్ని ఆకర్షించిన పోరాటంగా సాగింది. 

నాగలి పట్టి దుక్కి దున్నే రైతు జెండా పట్టి రోడ్డెక్కితే ఎంతటి రాజకీయ నాయకుడైనా దిగి రావలసిందే అని ఈ ఉద్యమం నిరూపించింది. రైతు తలుచుకుంటే ఏ రాజకీయ నాయకుడి తలలు అయినా  వంచగలడని రుజువుచేసింది.  జై భారత్. జై కిశాన్.