బాహుబలి కట్టప్ప మైనపు విగ్రహం లండన్ లో..

Posted on : 13/03/2018 04:30:00 pm

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రానాల బాహుబలి సినిమా ఇండియాలోనే కాక ప్రపంచంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అందులో నటించిన నటులు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకుగాను సత్యరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో కట్టప్పమైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్‌ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే. ఓ నటుడుకు దక్కే అరుదైన గౌరవాలలో ఇది ఒకటి. 

సత్యారాజ్ తమిళంలో దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క బాహుబలి తో వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ వచ్చేసింది. సత్యరాజ్‌ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన పాత్ర కట్టప్ప. ఈ మేరకు మ్యూజియం నిర్వహకులు సత్యరాజ్ కు సమాచారం అందించారని, త్వరలోనే వచ్చి కొలతలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి తమిళ నటుడిగా సత్యరాజ్ నిలువనున్నాడు. టుస్సాడ్స్ మ్యూజియంకు సంబంధించి ఈమధ్యే బ్యాంకాక్ లో ఓ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. కానీ సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని మాత్రం మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఏర్పాటు చేయబోతున్నారు. 

ఇప్పటివరకు రజనీకాంత్, కమల్ హాసన్ కు కూడా దక్కని అరుదైన గౌరవం సత్యరాజ్ కు లభించబోతోంది. కోలీవుడ్ కు చెందిన ఖుష్బూ లాంటి ఎంతోమంది ప్రముఖులు సత్యరాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్‌ కుమారుడు, నటుడు సిబిరాజ్‌ సామాజిక మాధ్యమం ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇది వైరల్ అవుతోంది.