డ్రామాలతోనే తాత్సారం - ఫలితం మాత్రం శూన్యం

Posted on : 13/03/2018 04:32:00 pm

"కుండలోని కూడు కుండలో ఉండాలి నా కొడుకు దుడ్డులా ఉండాలి" అనే సామెతకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కరెక్ట్ గా సరిపోతుంది. ఏపీకీ ప్రత్యేక హోదా, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఒక వైపు స్పష్టమైన సంకేతాలిచ్చినప్పటికీ ఇంకా కేంద్రాన్ని బుజ్జగించి బతిమాలు తుందే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా పోరాడుతున్న దాఖలాలెక్కడా కనబడటం లేదు. అవిశ్వాస తీర్మాణానికి మముందుకు రావడం లేదు, కేంద్ర మంత్రులతో  రాజీనామాలు చేయించారే తప్ప,  ఎన్డీయేలో కొనసాగడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలో తెలుగు ప్రజలకు అర్ధం కావడం లేదు. 

పైగా ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రజల గొంతు పార్లమెంట్‌లో ప్రతిధ్వనించాలని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత సరికాదని అన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం, హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం అన్నారు. మన పోరాటం నిర్మాణాత్మకంగా జరగాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాడాలని ఆదేశించారు.

అలాగే అసెంబ్లీ, మండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేగాక పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా కలుపుకోవాలన్నారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చారు. ఈరోజు సెంటిమెంటు చూసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు ఇదేమి న్యాయమని  అని చంద్రబాబు కేంద్రాన్ని  ప్రశ్నించారు. మా డిమాండ్లు హేతుబద్ధమైనవని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వాఫలమైందని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.