మావోయిస్టుల దాడిలో 8మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

Posted on : 13/03/2018 05:36:00 pm

సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలకు ఈ మధ్యకాలం మెరుపు దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూజారికాకేండులో పదిరోజుల క్రితం సీఆర్పీఎఫ్ జవాన్లు పదిమంది మావోయిస్టులను హతమార్చిన ఘటనకు ప్రతీకారంగా మావోయిస్టులు జరిపిన దాడిలో 8మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసారు. మరోపది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. సుక్మా జిల్లా బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. కిష్టరాం ప్రాంతంలో 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఈ ఘతాకానికి తెగబడ్డారు. ఈ ఘటనలో 8 జవాన్లు మృతిచెందగా, పదిమంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వైద్యం కోసం రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.

జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుక్మా జిల్లాలో ఆపరేషన్ కొనసాగుతుండగా మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఎదురుపడ్డారు.. ఇంతలో వారిపై జవాన్లు కాల్పులు జరపగా, కోబ్రా దళానికి చెందిన సభ్యులు తప్పించుకున్నారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి మోసెస్ దినకరన్ తెలిపారు. అనంతరం మధ్నాహ్నం 12.30 గంటల సమయంలో 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకున్న మరో మావోయిస్టుల బృందం కిస్టారం- పలోడి మధ్య మైన్ ప్రొటెక్టెట్ వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో పేల్చేసిందని ఆయన తెలియజేశారు.

పదకొండు రోజుల కిందట తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పూజారికాంకేడులో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్‌కు చెంది ఓ కానిస్టేబుల్‌ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఆరు మాసాల తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద మెరుపుదాడి ఇదే. గతేడాది మార్చిలో సుక్మా ప్రాంతంలో రహదారి నిర్మాణం కార్మికులకు కాపాలాగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ల క్యాంప్‌పై మావోలు దాడిచేసిన ఘటనలో 12 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన సైన్యం, నక్సల్స్ చర్యలను సమర్థంగా తిప్పికొడుతోంది. గత రెండేళ్లలో చత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో సుమారు 300 మందికి పైగా నక్సల్స్ హతమైనట్టు ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర హోంమంత్రి రామేశ్వక్ పైక్రా అసెంబ్లీలో ప్రకటించారు.