బీజేపీనేత బలుపుకి సొంత పార్టీనే ఫైర్

Posted on : 13/03/2018 06:31:00 pm

బీజేపీ నేతల నోటి దురుసు రోజురోజుకీ మరీ ఎక్కువైపోతోంది .అధికారంలో ఉన్నామనే అహంకారమో లేక స్వతహాగా వచ్చిన బలుపో తెలియదు గానీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదనే కనీస ఇంగితాన్ని పాటించకపోవడం దురదృష్టకరం. అయితే ఈ ఘటన మరీ విడ్డూరం ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేత ఏదో అన్నారంటే ఏదోలే అని సరపెట్టుకోవచ్చు, సమాజ్ వాదీ పార్టీలోనుంచి  కొత్తగా  బీజేపీ లోకి చేరిన  నరేష్ అగర్వాల్ జయాబచ్చన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ ఘటన పట్ల బీజేపీ సైతం సీరియస్ అవ్వడం ఇందులో ప్రధానాంశం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం.

సమాజ్ వాదీ పార్టీ నుంచి వస్తూనే బీజేపీ నేత నరేష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఎస్పీ తరఫు నుంచి రాజ్యసభ సీటును ఆశించిన ఈయన అక్కడ అది దక్కలేదని.. బీజేపీలోకి చేరిపోయారు. ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను కాదని.. నటి జయాబచ్చన్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారనే ఆక్రోశంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నరేష్ అగర్వాల్.

‘సినిమాల్లో నటించే వాళ్లతో, డ్యాన్సులు వేసుకునే వాళ్లతో నాకు పోలిక? వాళ్లతో నాకు పోలిక పెట్టి ఎస్పీ అధిష్టానం నన్ను దిగజార్చింది. వాళ్లకు ప్రాధాన్యతను ఇస్తూ నాకు టికెట్ నిరాకరించడం సబబు కాదు..’ అని వ్యాఖ్యానించారు నరేష్ అగర్వాల్. ఈయన మాటలపై ఎస్పీ స్పందించలేదు కానీ.. బీజేపీ మహిళా నేతలు మాత్రం ఘాటుగా స్పందించారు.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. నరేష్ అగర్వాల్ కు బీజేపీలోకి స్వాగతం, అయితే ఆయన మాటలు మాత్రం అనుచితమైనవి అని మండిపడ్డారు. ఇక మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇదే తరహాలో స్పందించారు. బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ, నటి రూపా గంగూలీ కూడా నరేష్ అగర్వాల్ మాటలను ఆక్షేపించారు. పార్టీ వేరే అయినా జయాబచ్చన్ ను రూప అభినందించారు. సినిమాల విషయంలో అయినా ఎంపీగా అయినా జయాబచ్చన్ ప్రాతినిధ్యం గొప్పది అని రూపా గంగూలీ కితాబిచ్చారు. అనుచితంగా మాట్లాడిన నరేష్ అగర్వాల్ పై బీజేపీ మహిళా నేతలు ఇలా మండిపడగా.. ఆయన మాటలతో తమకు సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.