సిరియా మారణ కాండ Full Story - Part III

Posted on : 13/03/2018 10:14:00 pm

                                                                                   
బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకం గా శాంతియుతంగా మొదలైన ఆందోళనలు కాస్తా హింసాత్మకమైన పోరాటం గా మారింది... సాయుధ తిరుగుబాటు దళాల  మధ్య ప్రభుత్వ రక్షక దళాల మధ్య పరస్పర దాడులు కాస్తా ప్రపంచ దేశాల మద్దతుతో యుద్ధం గా మారింది..
ప్రపంచ దేశాల పాత్ర
తిరుగుబాటుదారులని ఎదుర్కోడానికి అసద్ ప్రభుత్వానికి ఇరాన్ రష్యా దేశాల మద్దతు లభించింది. 1980 నుండి సిరియా ఇరాన్ కి మిత్రదేశం గా ఉంది.ఇరాన్ తన మిత్రదేశాలకి ఆయుధ సరఫరాని, ఇతరత్రా సామాగ్రి అందచేయడానికి సిరియాను ఉపయోగించుకుంటుంది.. దానికి ప్రతిగా సిరియా కు మిలిటరీ పరమైన రాజకీయపరమైన మద్దతును అందిస్తుంది. ఇరాన్ అసద్ ప్రభుత్వం పైన తిరుగుబాటును సిరియాకి మాత్రమే ముప్పు గా పరిగణించలేదు తమ దేశానికి కూడా ముప్పుగా పరిగణించింది. 2012 లో తన మిలిటరీ బలగాలను అసద్ కి మద్దతుగా సిరియాకి పంపించింది. ఇలా ఇరాన్ తన వంతు పాత్ర పోషించింది.ఇరాన్ చేరికతో సహజం గానే ఇరాన్ శత్రుదేశాలకి అసద్ లక్ష్యం గా మారాడు. సౌది అరేబియా మరియూ ఇంకొన్ని గల్ఫ్ దేశాలు ఇది అవకాశం గా తీసుకుని ఇరాన్ మిత్రుడైన అసద్ కి వ్యతిరేకంగా సిరియా తిరుగుబాటుదారులకి మద్దతుగా ఆయుధ సామాగ్రిని యుద్ధ పరికరాలని అందించింది. ఇలా అంతర్యుద్ధం కాస్తా బయటి దేశాల మద్దతుతో ఇరాన్ మరియూ వ్యతిరేక దేశాల మధ్య యుద్ధం గా మారింది. ఆ తరువాత రష్యా అమెరికా దేశాల జోక్యం తో తీవ్ర యుద్ధం గా రూపు దాల్చింది.
రష్యాకి సిరియా 1960 ముందు నుండి మిత్రదేశంగా ఉంది. రష్యాకి సిరియాలో విలువైన నావికా స్థావరాలు ఉన్నాయి. సిరియాకి 48 శాతం ఆయుధ సామాగ్రి రష్యా నుండి కొన్నవే. వ్యాపార పరం గా కూడా రష్యా సిరియాల మధ్య విలువైన సంబంధాలు ఉన్నాయి. ఆ విధం గా యుద్ధం మొదలైన దగ్గర నుండి రష్యా సిరియా ప్రభువ్తానికి అండగా నిలిచింది. అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసింది. MI 25 లాంటి యుద్ధ విమానాలని ప్రభుత్వానికి మద్దతుగ పంపింది. 2015 లో రష్యా ప్రత్యక్షం గానే యుద్ధం లో పాల్గొని తన యుద్ధ విమానాలతో శత్రు స్థావరాలపై దాడులు చేసింది. దాదాపు 10000 మంది సైనికులని సిరియాకు పంపింది.రష్యా చేరికతో సహజం గానే అమెరికా  ప్రతిపక్షం వైపు నిలబడింది. అమెరికా ఈ వ్యవహారం లో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. తను పరోక్షం గా సిరియా ప్రతిపక్షానికి సహాయసహకారాలు అందించింది. కాని రసాయన దాడులని మాత్రం ఖండిస్తూ వచ్చింది. సిరియా ప్రభుత్వం రసాయన దాదులకు పాల్పడితే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తూ వచ్చింది.మొదట అమెరికా ఆంక్షలకి తలొగ్గినట్లు కనిపించిన సిరియా ప్రభుత్వం ఆ తరువాతి కాలం లో ఆంక్షలని అధిగమించి తిరుగుబాటుదారులున్న ప్రదేశాల్లో రసాయన దాడులు జరిపింది. ఈ చర్యలతో అమెరికా కూడా ప్రత్యక్షంగా యుద్ధరంగం లోకి దిగే సూచనలనిస్తుంది.
మరోవైపు ఐసిస్ ని కట్టడి చేసే పనిలో భాగం గా కూడా అమెరికా సిరియా యుద్ధం లో ప్రత్యక్షం గా పాల్గొని ఐసిస్ ని లక్ష్యం గా చేసుకుని కొన్ని దాడులని జరిపింది.
ఉగ్రవాదం:
  ఉగ్రవాదం కూడా తన ఉనికిని చాటుకోడానికి తన పరిధిని విస్తరించడానికి సిరియా యుద్ధం లోకి చొరబడింది. తిరుగుబాటు మొదలవుతున్న తొలినాళ్ళ నుండే అల్ ఖైదా తన బలగాలని సిరియాకి పంపనారంభించింది. అంతర్గత కలహాలని తన బలాన్ని పెంచుకోడానికి తన ఉనికిని చాటుకోడానికి వాడుకుంది. స్థానికులని ప్రేరేపించి వాళ్ళని ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడం మొదలు పెట్టి బలపడుతూ వస్తున్నారు. సిరియాలో ఉగ్రవాదం బలపడడానికి ముఖ్యకారణం దేశం లో అధికసంఖ్యాకులైన సున్నీ ముస్లింల పై అల్పసంఖ్యాకులైన షియా ముస్లింల ఆధిపత్యం. అసద్ ప్రభుత్వం షియా ముస్లింలకి అనుకూలం గా ఉండేది. ప్రభుత్వం లో షియాలే అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నారు. సహజం గానే సున్నీలకి మత పరంగా ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడింది. ఇదే అదనుగా సున్నీలని తమ వైపు తిప్పుకోవడం లో అల్ ఖైదా  సఫలమైంది. అల్ ఖైదా నుండి ఉద్భవించిన ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థ సిరియా లోని కొన్ని ప్రదేశాలని తన హస్తగతం చేసుకోవడం మొదలు పెట్టింది. ఐసిస్ సిరియా తో పాటు ఇరాక్ లో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది. ఐసిస్ సిరియా లోని కొన్ని ప్రాంతాలని హస్తగతం చేసుకుని అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలని వాడుకుని ఆర్ధిక వనరులని సమకూర్చుకుంటుంది. 
ప్రస్థుత పరిస్థితి:
ఇలా ఉగ్రవాదం మరియూ ప్రపంచ దేశాల జోక్యంతో అంతర్యుద్ధం కాస్తా ప్రచ్చన్న యుద్ధం గా రూపుదాల్చింది. దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలని ఈ యుద్ధం పొట్టన పోసుకుంది. అభం శుభం తెలియని వేల మంది చిన్నారులు తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా నేల రాలిపోతున్నారు. ఒక వైపు గుళ్ళ వర్షం ఒక వైపు బాంబుల వర్షం మరోవైపు రసాయన దాడులు ఇవి కాక ఉగ్రవాదుల కృరత్వానికి తెగిపడుతున్న తలలు.ఈ మారణ కాండ కి అంతం ఎప్పుడో తెలియదు..ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకలేక దాదాపు 13 మిలియన్ మంది ప్రజలు వాళ్ళ నివాసాలని, ఊళ్ళని వదిలి పరాయి దేశాలకి వలసపోతున్నారు. అందులో దాదాపు 6 మిలియన్ల ప్రజలు తమ సొంత ఊర్లకి ఎప్పటికైనా వెళ్ళాలన్న ఆశ చావక  సిరియాలోని వేరే ప్రదేశాలకి వలసవెళ్ళారు. సిరియా సమీప దేశాలైన లెబనన్ ఈజిప్ట్ జోర్డాన్ టర్కీ లకి దాదాపు 4.8 మిలియన్ల మంది వలసపోయారు.కొంతమంది ప్రశాంతమైన జీవితాన్ని ఆశించి యూరోప్, జర్మనిలకి వలసపోతున్నారు.సిరియా నుండి వస్తున్న శరణార్ధులని కొన్ని దేశాలు ఆదరిస్తుంటే, శరణార్ధుల తాకిడి తట్టుకోలేక చాలా దేశాలు అనుమతించటం లేదు, ఇలా స్వంత దేశం లో బ్రతకలేక పరాయి దేశాలకి వలస వెళ్ళే దారిలేక పరాయి దేశాల దయకోశం పడిగాపులు కాస్తున్న ఎంతమంది నిర్భాగులు.నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
ఐక్య రాజ్య సమితి
ఐక్య రాజ్య సమితి కూడా సిరియా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది.రష్యా మరియూ అమెరికాల వైరం వల్ల ఏకాభిప్రాయం కుదరక ఎటువంటి అడుగు ముందుకు వేయలేకపోతుంది.
ఈ సమస్యకి ముగింపు దరిదాపుల్లో కనపడడం లేదు.. ఇలాగే కొనసాగితే సిరియా అనే దేశం కొన్నేళ్ళల్లో చరిత్రలో మిగిలిపోబోతుంది. వాస్తవం నుండి కనుమరుగవబోతుంది. మానవాళి చరిత్రలో దారుణమైన మారణకాండల్లో సిరియా అంతర్యుద్ధం కూడా ఒకటిగా నిలిచిపోయింది.
-బ్రహ్మా బత్తులూరి