అప్పుడేమో తోకను చూపించి పులన్నారు - ఇప్పుడేమో పులి లేదు హోదా లేదు

Posted on : 14/03/2018 08:41:00 am

ప్రత్యేక హోదాపై ఆంధ్రుల ఆశల్నే కాదు, ఆత్మాభిమానంతో కేంద్రప్రభుత్వం ఆడుతున్న ఆటలు చూస్తుంటే ఆంధ్రాప్రజలకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విభజన హామీ చట్టంలో పొందుపరిచిన ప్రతి హామీను నెరవేరుస్తామని మాటిచ్చిన కేంద్రం ఇప్పుడేమో మాట మార్చింది. రెవెన్యూ లోటుతో వేరుకాపురం పెట్టిన ఆంధ్రాకు మొదట్నించి కేంద్రం మొండి చేయి చూపిస్తూనే వచ్చింది. విభజన ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయమంటూనే మా వల్ల కాదంటూ కేంద్రం చేతులెత్తేసింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రం దగ్గర చేతులు కట్టుకోవడం తప్ప దాదాపుగా గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రగతికి పెద్దగా సాధించిందంటూ ఏమీ లేదని తేలిపోయింది. "ఇదిగో తోక అంటే అదిగో పులి"అంటూ బీజేపీ విషయంలో ఇంత కాలం ప్రజలను మభ్య పెట్టిన చంద్రబాబు చివరొకొచ్చేసరికి రాజకీయ ప్రయోజనాలకోసమే పాకులాడుతున్నారే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నది ఎన్డీయే తో బయటకు రాకపోవడంతో తేలిపోయింది. 

ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలు, తీసుకుంటున్న ‘యూ టర్న్‌’లు అసెంబ్లీ వేదికగా మరోసారి బయటపడ్డాయి. విభజన చట్టం, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. దీన్ని బట్టి ప్రత్యేక హోదాపై ఆయనకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏడాది కిందట ప్యాకేజీని ఆహ్వానించి, ప్రధాని నరేంద్ర మోదీకి ఆకాశానికి ఎత్తి మరీ తీర్మానం చేసిన చంద్రబాబు ఇపుడు దానికి విరుద్ధంగా తీర్మానం చేశారు.

అయితే చంద్రబాబు చేసిన తీర్మానంలో, లోపలెక్కడో ‘ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నపుడు మాకెందుకివ్వరు’ అన్న డొంకతిరుగుడు సణుగుడు తప్ప మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న డిమాండ్‌ లేదన్న విషయంపై ప్రతిపక్ష వైసీపీ మండిపడుతోంది. దీన్ని అమలు చేయకపోతే ఏం చేస్తామన్న కార్యాచరణ ప్రణాళిక ఎక్కడా మచ్చుకైనా కనిపించక పోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా హోదా ఇవ్వక పోతే తాము ఏం చేస్తాం అన్న స్పష్టత లేదు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాసం పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ ఆరున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు, తేదేపా ఎంపీలు కూడా ముందుకొచ్చి మొత్తం 25 మంది ఎంపీలూ రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ఇప్పటికే వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండింటి గురించి కూడా అటు తీర్మానంలో గానీ, ఇటు ముఖ్యమంత్రి ప్రసంగంలో గానీ ప్రస్తావన రాలేదు. ప్రజల్లో ప్రత్యేక హోదా భావోద్వేగాలు ప్రబలిన నేపథ్యంలో ఓ కంటితుడుపు చర్యగా మంత్రులతో రాజీనామాలు చేయించారు.

తేదేపా తమ మంత్రులతో రాజీనామాలు చేయించి ఎన్డీయేలో కొనసాగుతున్నట్లుగానే ,విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తీర్మానంలో కోరుతూ 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు కాబట్టి మిగిలిన రాష్ట్రాల మాదిరిగా మాకెందుకు హోదా ఇవ్వరు అని డొంకతిరుగుడు ప్రస్తావన చేశారు. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను గమనించి ఏదో మొక్కుబడి తీర్మానం చేసినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ‘‘ఈ తీర్మానం చేస్తున్నాం.. దీనిని కేంద్రానికి పంపిస్తున్నాం.. కేంద్రం స్పందించకపోతే మేము ఏం చేస్తాం’’ అనే స్పష్టత లేకుండా.. ఎప్పటిలాగే ప్రతిపక్షంపై విమర్శలు కురిపించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఒకవైపు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. ఇద్దరం కలసి ఈ పోరాటం చేద్దాం అని ఆహ్వానించింది. అవిశ్వాస తీర్మానం పెట్టడం, 25మంది ఎంపీల రాజీనామాలు.. ఈ రెండు విషయాలపై మాత్రం ముఖ్యమంత్రి తీర్మానంలో గానీ తన ప్రసంగంలో గానీ స్పందించలేదు. ఎలాంటి ఉపయోగమూ లేని మొక్కుబడి తీర్మానం చేశారన్న విమర్శలను తేదేపా మూటగట్టుకుంది.


మోదీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానంలో ‘రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోంది’అని చెప్పారు. ‘‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని,  ఇప్పుడు హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమని కేంద్రం చెప్పింది. హోదా బదులు దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించేలా ప్రత్యేక సహాయం ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి రాష్ట్రానికి నిధులు పెద్దగా రాకపోగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ.. అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక సహాయం ప్రకటనపై సెప్టెంబరు 9, 2016న శాసనసభలో చర్చ సందర్భంగానూ,  ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పించిందని కేంద్రాన్ని అభినందిస్తూ మార్చి 16, 2017న తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగానూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా సిఫార్సు చేయలేదని,  ఆ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పారని కూడా సాక్ష్యాలతో సహా సభ ముందు ఉంచారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకూడదంటూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చంద్రబాబు ఆ రోజు మాటమార్చారు. ఇపుడు ఆయన ఆ విషయంలోనూ యూటర్న్‌ తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా సిఫార్సు చేయలేదని అదే చంద్రబాబు ఈరోజు సభాముఖంగా సెలవిచ్చారు.

ప్రజల్లో సెంటిమెంట్‌ నానాటికీ బలపడుతుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆగస్టు 31, 2015న ఒక సారి మార్చి 16, 2016న మరో సారి కంటితుడుపుగా చంద్రబాబు శాసనసభలో తీర్మానాలు చేయించారు. ఆ తర్వాత ఐదు నెలల్లోనే మాట మార్చారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.. ఆ హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయి.. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తే వద్దంటామా అన్నారు. దాంతో సెప్టెంబరు 7, 2016న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించిన వెంటనే..  చంద్రబాబు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ దాన్ని స్వాగతించారు. ఆ తర్వాత ఆ ప్రత్యేక సహాయానికి కేంద్ర మంత్రి మండలి ‘చట్ట బద్ధత’ కల్పించిందంటూ మార్చి 16, 2017న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పాటుపడితే ఆంధ్ర ప్రజలు మరోసారి అక్కునచేర్చుకుంటారు లేదంటే ప్రజల ఆగ్రహానికి తేదేపా గురి కాక తప్పదనే సంకేతాలు ఇప్పటికే ప్రజలనుంచి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మోదీని ఆహో ఓహో అని పొగిడిన ఏపీ సీఎం ఈ రోజున  కేంద్రం మోసం చేసింది నేనేం చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నది అక్షర సత్యం.