కొద్దిసేపట్లో ప్రారంభమౌతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ

Posted on : 14/03/2018 03:11:00 pm

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం సభా వేదిక, ప్రాంగణాన్ని జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.  జనసేన నాయకులు మారిసెట్టి రాఘవయ్య, గద్దె తిరుపతిరావు, గంగాధరరావు తదితరుల పర్యవేక్షణలో సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో పాల్గొనడానికి జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. 

నిర్వాహకుల అంచనా ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు మూడు లక్షల మంది కార్యకర్తలు సభకు వస్తారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సభ విజయవంతం చేయాటనికి కృషి చేస్తోంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో తొలుత సాంస్కృతిక కార్యక్రమా లు జరగనున్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశారాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు 200 మంది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేదికపై నుంచే పవన్‌కల్యాణ్‌ తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని సుమారు వెయ్యి మంది వాలంటీర్లతో మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. 

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. పవన్‌ దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. కార్యకర్తలు విజయవాడ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. పార్టీ నేత ముత్యంశెట్టి కృష్ణారావు ఆధ్వర్యంలో జనసేన జాతీయ ఐక్యత ఈ పాదయాత్రను చేపట్టారు. జాతీయ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి సభా వేదిక వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. మరోవైపు ఉభయ రాష్ట్రాలనుంచి పవన్ అభిమానులు కూడా ఈ సభలో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్నారు. నిన్న అర్బన్‌ ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీలు వైటీ నాయుడు, తిరుపాల్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.