ఎట్టకేలకు పవన్ ప్రశ్నించాడు

Posted on : 15/03/2018 10:12:00 am

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రొటీన్ గా వెళ్తే జనంనుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం ముందు ముందుకు కష్టమనుకున్నాడో ఏంటో తన స్ర్కిప్టు, స్టాండ్ ,రెండూ మార్చాడు. ఏ బహిరంగ సభ లోనైనా అన్ని రాజకీయ పక్షాలను పొగుడుతూ పలానా  రాజకీయ నేతంటే ఎంతో గౌరవం అంటూ కర్ర విరగా కుండా పాము చావ కుండా అత్యంత చాకచక్యంగా ప్రవర్తించే పవన్ జనసేన ఆవిర్భావ సభలో అందుకు పూర్తి విభిన్నంగా ప్రవర్తించి జనంలో జనసేన పర్వాలేదనిపించాడు. చంద్రబాబు పట్ల విధేయతతో మెలిగి, చంద్రబాబు చేతిలో పవనొక కీలుబొమ్మ మాత్రమే తప్ప స్వయంగా ప్రకాశించే నక్షత్రం కాదు పవన్ అనే విమర్శలకు మాత్రం నిన్నటి రోజున ధీటుగానే సమాధానం చెప్పాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరుగుతూ తన ప్రసంగాన్ని ఆద్యంతం రసవత్తరంగా కొనసాగించాడు, అరుణ్ జైట్లీతో మొదలెట్టి చంద్రబాబు, లోకేష్ ఇలా ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా ఉతికారేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బీజేపీ, తేదేపాలు రెండూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తుందనే గతంలో మద్ధతు ఇచ్చానన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయడంలో దొందూ దొందోనేనని పవన్ ఆరోపించారు. 

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గేర్ మార్చాడు, తన రాజకీయ రధం లూప్ లైన్ వదిలి, మెయిన్ లైన్లోపడింది, గెలుపోటములు పక్కన పెడితే ప్రతి రాజకీయ పార్టీకి స్వతంత్ర భావజాలం ఉండాలి. ప్రతి నేతకు ఒక క్లారిటీ ఉండాలి నిన్నటి వరకూ పవన్ విషయంలో జనం అభిప్రాయం ఇదే. నిన్నటి వరకూ ఆయన టీడీపీ సానుభూతి పరుడు అనే ముద్ర జనసేన పార్టీ ఆవిర్భావ సభతో పటాపంచలైంది. పవన్ కళ్యాణ్‌కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం చంద్రబాబే అన్న నోర్లు పవన్ నేటి స్పీచ్‌తో మూతపడనున్నాయి. జనసేన అధినేత పార్టీని స్థాపించి నాలుగేళ్ల కాలంలో తొలిసారిగా ఆవిర్భావ సభను బుధవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరి కాజా సమీపంలోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగిన పార్టీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అధికార టీడీపీపై నిప్పులు కురిపించారు.

ముఖ్యంగా చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రస్తుత మంత్రి లోకేశ్ బాబు అవినీతిపై సంచలన కామెంట్స్ చేస్తూ తన ఉన్న టీడీపీ సానుభూతి ముద్రను పూర్తిగా చెరిపేసుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తూంటే కంచే చేనుని మేస్తుందనే సామెత గుర్తొస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి కాని.. తెలుగుదేశం పునర్ నిర్మాణానికి కాదంటూ చురకలంటించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం తీరుని గమనిస్తూ వీళ్లు చేసే అవినీతి అక్రమాలపై విసిగిపోయా అన్నారు. చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది. కొత్తాగా ఏర్పడిన రాష్ట్రానికి ఏదో చేస్తారని ఆయన్ని నమ్ముకుంటే ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.

29 సార్లు ఢిల్లీకి తిరిగితే హోదా వస్తుందా? ముందు మన బంగారం మంచిదో కాదో చూసుకోవాలి కదా అన్నారు. "నేను చాలా రిస్క్ తీసుకుని 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రజలకు అండగా ఉంటుందని నమ్మితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దేశంలో అవినీతిలో అగ్రగామిగా రాష్ట్రాన్ని మార్చరన్నారు". ఏమైపోయింది మీ అనుభవం అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ స్కాం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలంటే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఓటేయాలన్నారు అప్పుడు నేను కూడా ఉన్నా కాని ఇప్పుడు అంధ్రప్రదేశ్ స్కాం ఆంధ్రప్రదేశ్ కాలేదు కాని అవినీతి ఆంధ్రప్రదేశ్ అయ్యిందన్నారు. ఇసుకు ఉచితం అని చెప్పి ఈరోజు లారీ ఇసుక రూ.10 వేలు చేశారు. అదీ మీరు చేసిన ఘనకార్యం అన్నారు. ఇసుక అక్రమాలపై అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వాళ్లని సమర్ధించారన్నారు.

గత ఎన్నికల్లో మీ మేనిఫేస్టో పెట్టిన అంశాలు ఏమయ్యాయన్నారు? అమలు కావని తెలిసికూడా ఎందుకు మేనిఫేస్టోలో చేర్చారన్నారు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు ద్రోహం చేశారు. ఓటుకి నోటు కేసులో కాంప్రమైజ్ కాలేదా? కాపుల రిజర్వేషన్స్ ఇస్తానని మేనిపేస్టోలో పెట్టారు. దీంతో కాపులకు బీసీలకు గొడవలు పెట్టారు. వర్గీకరణ విషయంలో ఎస్సీల్లో గొడవలు పెట్టారు. మాట్లాడితే సింగపూర్ లాంటి రాజధాని అంటున్నారు. వేల ఎకరాల్లో రాజధాని నిర్మించి అక్కడ అభివృద్ది చేస్తే సరిపోతుందా? మరి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏమవ్వాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం ఏంకావాలన్నారు. తెలంగాణ విషయంలో హైదరాబాద్‌‌కే పెట్టుబడులు వచ్చేలా చేసి తప్పుచేశారని మళ్లీ అదే తప్పును ఏపీ రాజధాని విషయంలో చేస్తున్నారన్నారు. సింగపూర్ తరహా రాజధాని అంటే ఎత్తైన భవనాలు కాదు ఉన్నత మైన ప్రమాణాలులన్నారు. మీరు చేసే పనులు చూస్తుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇదే స్టాండ్ చివరి వరకూ కొనసాగితే పార్టీ అధికారం మాట పక్కన పెడితే ప్రశ్నించేందుకే పవన్ పార్టీ పెట్టాడన్న మాటైనా జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది ఇవాళ కాక పోయినా రేపైనా జనసేనకు ప్లస్ అవుతుంది.