కాలికి చెప్పులా ఉంటాడనుకున్నాడు - కానీ కంట్లో నలుసైపోయాడు

Posted on : 15/03/2018 10:44:00 am

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే, ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే చంద్రబాబు మాటలు గత ఎన్నికల్లో నమ్మాల్సి వచ్చిందని, ప్రత్యేక హోదా విషయంలో మోదీని, ప్రత్యేక ప్యాకేజి విషయంలో చంద్రబాబుని నమ్మి గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తరుపున ప్రచారం చేసినట్లు పవన్ ఎప్పటినుంచో చెప్పుకొస్తున్న మాట. అయితే జనసేన ఆవిర్భావ సభను పవన్ పక్కాగానే ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడూ పొగడ్తలతోనే పనికాదనుకున్నాడో ఏమో గానీ ఈ సారి స్క్రిప్టులో విమర్శలను హైలేట్ చేసి తన ప్రసంగంతో తానూ హైలేట్ అయ్యాడు. అంతవరకూ బాగానే ఉన్నా గతంలో భుజాలమీద చేతులేసుకొని పక్కపక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చిన చంద్రబాబు, నిన్న  పవన్ చేసిన ప్రసంగాన్ని, తండ్రీ, కొడుకులపై చేసిన విమర్శలను, ఆరోపణలను జీర్ణించుకోలేక పోతున్నారు. కాలికి చెప్పులా ఉంటాడనుకున్నవాడు కంట్లో నలుసుగా మారితే ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు? ఇంత వరకూ చంద్రబాబు, పవన్ లు కలిసి జనంతో డ్రామా ఆడుతున్నారనే వాధన బలంగా వినబడేది. ఇప్పుడేమో పవన్ వెనుక ఇంకెవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం గమనార్హం. ఏదేమైనా పవన్ కల్యాణ్ ను రాజకీయాల్లో ఎవరో ఒకరు నడిపించనిదే తాను స్వయంగా నడవలేడని పరోక్షంగా చంద్రబాబు స్టేట్ మెంట్ ఇచ్చినట్లే అర్ధం చేసుకోవచ్చు.

బుధవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పవన్ తమనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్న కేంద్రాన్నిగానీ, ప్రధాని మోదీనిగానీ నిలదీయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న తమపై విమర్శలు గుప్పించడమేంటని చంద్రబాబు విస్మయం చెందారు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతుంటే కేంద్రాన్ని ఆయన ఒక్క మాట కూడా అనకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. లోకేష్‌ను, తనను, ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే ఈ సభ పెట్టినట్టుగా ఉందని, ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకంలా తనకు అనిపిస్తోందని అరోపించారు. కేంద్రంతో ఇంతటి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోన్న మాకు అండగా ఉండాల్సింది పోయి, మాపైనే విమర్శలను ఎక్కుపెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దిన  పత్రికలో వచ్చిన వాటినే పవన్‌ ప్రస్తావిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

మరోవైపు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం బుధవారం అర్థరాత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని రాజకీయశక్తులన్నీ ఏకమై కేంద్రాన్ని నిలదీసి, సాధించుకోవాల్సిన అవసరముందని అన్నారు. తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులోను, బయటా పోరాటం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని మంత్రులతో రాజీనామా చేయిస్తే మమ్మల్ని తిట్టడమేంటిని సీఎం వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇన్ని రోజుల నుంచీ మేం పోరాటం చేస్తుంటే ? పవన్‌ ఇప్పుడే మొదటిసారి మాట్లాడుతున్నారు, ఇది ఎవరో ఆడిస్తున్న నాటకమా! అన్న సందేహం కలుగుతోందని అన్నారు.

తాము కులాల మధ్య చిచ్చు పెడుతున్నామనడం అర్థరహితమని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపరిచామన్నారు. మత్స్యకారుల్ని సైతం ఎస్టీల్లో చేరుస్తామన్నదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీయే , పవన్‌ గత ఎన్నికల్లో తెదేపాకి మద్దతుగా ప్రచారం చేశారంటే మేనిఫెస్టోలోని అంశాల్ని సమర్థించినట్టే కదా? అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల్ని తమ దృష్టికి తెచ్చినప్పుడు ఆయనపై ఉన్న గౌరవంతో సానుకూలంగా స్పందించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడైన లోకేశ్, ఓ వ్యాపార సంస్థను కూడా నిర్వహిస్తూ ప్రజాసేవ చేయాలన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వస్తే పవన్‌ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఏదేమైనా కలిసొస్తాడనుకున్న పవన్ నట్టేట ముంచేశాడని చంద్రబాబు తెగఫీలైపోతున్నారని సమాచారం. రాజకీయం అంటే ఇంతేగా ఇది ప్రత్యేకించి చంద్రబాబుకి ఇంకొకరు నేర్పాలా?..