రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ అసత్య ఆరోపణలు : శేఖర్ రెడ్డి

Posted on : 15/03/2018 11:13:00 am

పవన్ ఏపీలో మీట నొక్కితే తమిళనాడులో బల్బు వెలిగింది. పవన్ ఆరోపణలు కేవలం నిరాధారమైనవని ,తన పేరు ప్రస్తావిస్తే జనసేనకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టే పవన్ తన పేరు ప్రస్తావించారే తప్ప అంతకు మించి పవన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు తమిళనాడుకు చెందిన మైనింగ్ వ్యాపారి, టిటిడి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి. మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి కేసులో నారా లోకేశ్‌ పేరు ఉన్నందునే చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జనసేనాని చేసిన వ్యాఖ్యలపై శేఖర్‌రెడ్డి స్పందించారు. ఓ పత్రికతో ఆయన మాట్లాడుతూ.. పవన్ ఆరోపణలు వాస్తవ దూరమైనవని కొట్టిపారేశారు. తాను వస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో తమిళనాడు రాజకీయ నేతలు పిలుస్తారని, తన పేరు పలికితే జనసేనకు కూడా శుభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ ప్రస్తావించి ఉంటారని ఎద్దేవా చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబును తాను ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కలిశానని, లోకేశ్‌ను అసలు ఎప్పుడూ కలవలేదని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా తనను నియమించినప్పుడు ఓసారి, సీఎం తిరుపతికి వచ్చినప్పుడు మరోసారి మాత్రమే కలిశానని తెలిపారు. ఆ తర్వాత ఎన్నడూ చంద్రబాబు కలవలేదన్నారు. అయినా తమిళనాడులో ఉండే వారికి ఏపీ నేతలతో పనేముంటుందని ప్రశ్నించారు. అంతేకాదు తనకు ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు.

500 లారీలు, 700 పొక్లెయిన్లు ఉన్న తనకు ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, అలాంటప్పుడు తాను సాయం అడుక్కోవడం ఏమిటని శేఖర్‌రెడ్డి నిలదీశారు. తాను సాయం చేస్తాను తప్పా, ఇతరుల సొమ్మును తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి సిఫార్సు చేస్తే, తమిళనాడు కోటా నుంచే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారని వెల్లడించారు. సీబీఐ దాడుల గురించి కూడా ప్రస్తావించిన శేఖర్ రెడ్డి, ఇప్పటి దాకా దర్యాప్తు అధికారులకు నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు కాబట్టే నేరాన్ని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. అయినా మనలో మన మాట ఇవేమీ తెలియకుండానే పవన్ తేదేపాతో చేతులు కలిపారా?లేక గుట్టు మొత్తం తెలుసుకొని తన స్వప్రయోజనాల కోసం మిత్రద్రోహం చేస్తున్నారా?ఏదేమైనా రాజకీయాల్లో ఇదంతా సహజమే ఆ క్షణం వరకూ తిట్టుకుంటారు కలిసినప్పుడు నవ్వుతూ పలకరించుకుంటారు. ఇక్కడ ఎర్రిబాగులోళ్లు జనమే. వాళ్లు చెప్పే సొల్లు మొత్తం విని అదేదో నిజమనేసుకుంటారు.