నిండా ముప్ఫైలేనోడు యోగీకే షాకిచ్చాడు

Posted on : 15/03/2018 12:13:00 pm

"సప్త సముద్రాలు ఈదినోడు చివరకు ఇంటివెనుకున్న పిల్లకాలువలో పడి చచ్చాడనే" తెలుగు సామెతలెక్కుంది ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉంది, ఉత్తర ప్రదేశ్ పగ్గాలు సైతం బీజీపీ చేతిలోనే ఉన్నాయి. పైగా 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ జెండా అప్రతిహాతంగా ఎగరుతోంది. యోగీ ఆదిత్యనాధ్  అనే పేరు దేశ వ్యాప్తంగా బ్రాండైపోయింది. ఇవేవీ అతని విజయాన్ని అడ్డుకోలేక పోయాయి. నిండా మూడు పదుల వయసులేనీ ఓ బుడతడు యూపీలో బీజేపీని బోల్తా కొట్టించాడు. దాదాపు అక్కడ ముప్ఫైఏళ్లుగా బీజేపీ ఏక చత్రాదిపత్యం వహిస్తోంది అలాంటి బీజేపీ విజయాన్ని  సమాజ్ వాదీ పార్టీ సమాది చేసేసింది. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒకప్పుడు గోరఖ్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన సీఎం కావడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక జరిగింది. అందులో బీజేపీ ఊహించని విధంగా ఓటమి పాలయింది. ఇంతవరకూ అక్కడ మరే పార్టీ వ్యక్తి కూడా  విజయం దక్కించుకోలేదు. పైగా ఇక్కడి గోరఖ్‌నాథ్‌ మఠంలోని పూజారులే ఎంపీలుగా గెలుస్తున్నారు. దీంతో సమాజ్‌వాది పార్టీ ప్రవీణ్‌కుమార్‌ నిషాద్‌ అనే యువకుడిని రంగంలోకి దింపింది.

బీఎస్‌పీ మద్దతు కూడగట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే అతడి వయసు కూడా 29 ఏళ్లు. నిషాద్‌ను ఎన్నికల్లో దింపే వరకు కూడా అతడు పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో 29 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల గోరఖ్‌పూర్‌లోని బీజేపీ సామ్రాజ్యాన్ని కూలదోశాడంటూ చర్చ సాగుతోంది. 1998 నుంచి ఇక్కడ యోగి విజయం సాధిస్తున్నారు. దాంతో ఎవరికీ తెలియని నిషాద్‌తో పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదని బీజేపీ వర్గాలు ఊహించగా అనుకోని విధంగా అతడు విజయం సాధించాడు.

ఈ విజయం యోగికి, బీజేపీకి ఊహించని షాక్‌ కాగా సమాజ్‌ వాది పార్టీ కూడా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు వారు ఊహించని విజయం సమాజ్‌వాది పార్టీకి దక్కిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక నిషాద్‌ గురించి పరిశీలిస్తే అతడు లక్నోలోని గౌతం బుద్ద యూనివర్సిటలో ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు. 2011లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. అతడిపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. అఫిడవిట్‌ ప్రకారం అతడి ఆస్తులు రూ.11లక్షల లోపే. అందులోను రూ.99,000 లోన్‌ కూడా ఉంది. అతడి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.