ఉన్నివి చాలవన్నట్లు మరో కొత్తది పుట్టుకొచ్చింది

Posted on : 15/03/2018 12:46:00 pm

తమిళనాడులో పూటకో పార్టీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఓటర్ల కంటే పార్టీలే ఎక్కువగా ఉన్నాయా అనేంతగా తమిళ రాజకీయ పార్టీలు పెరిగిపోతున్నాయి. ఓవైపు  సెలెబ్రెటీలు రాజకీయాల్లోకి వస్తుంటే ,మరికొంత మంది రాజకీయాల్లోకొచ్చి సెలబ్రెటీలైపోతున్నారు. ఈ ఉపోద్ఘాతం మొత్తం జయలలిత ఫొటోతో పుట్టుకొచ్చిన మరో రాజకీయ పార్టీకోసమే ఆ వివరాలేంటో ఒక సారి చూద్దాం రండి. తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. శశికళ మేనల్లుడు, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. 

మధురైలో జరిగిన సభలో పార్టీ పేరుతో పాటూ జెండాను కూడా ఆవిష్కరించారు. తెలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్న జెండాపై దివంగత సీఎం జయలలిత ఫోటోను ముద్రించారు. ఈ సభలోనే పార్టీ ఎజెండాను కూడా ప్రకటించారు దినకరన్. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకులు గుర్తు విషయంలో వెనక్కు తగ్గేది లేదని , దాని కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు ఎన్నికలు సంఘం కేటాయించిన కుక్కర్ గుర్తుతోనే కొనసాగుతామన్నారు.

శశికళ ఆశీర్వాదంతోనే పార్టీని ప్రకటిస్తున్నానని,  అమ్మ జయలలిత ఆశయాల సాధనే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని దినకరన్ స్పష్టం చేశారు. ఈ సభకు 22మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత తంగం తమిళ్ సెల్వన్ చెప్పారు. ఇప్పటికే హీరోలు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ కూడా తాము రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కమల్‌హాసన్‌ కూడా ఇదే మదురైలో మక్కల్‌ నీది మయమ్‌ పేరుతో పార్టీని ప్రారంభించారు. ఇప్పుడు దినకరన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.