మాటలు కట్టిపెట్టి పని చూస్కోమన్న కర్ణాటక సీఎం

Posted on : 15/03/2018 02:49:00 pm

"ఓడలు .. బండ్లు, బండ్లు .. ఓడలు" అవడమంటే ఇదేనేమో!నిన్నటి వరకూ మాణిక్ సర్కార్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించామని సంభర పడిన బీజేపీకి యూపీలో గర్వభంగమైంది. దాదాపు 29 ఏండ్ల కంచు కోటకు బీటలు పడ్డాయి. విజయం ఎప్పుడూ ఒకర్నే వరించదు అదే జరిగితే ఓటమి అనే మాటకు నిఘంటువుల్లో సైతం అర్ధం దొరకదని యూపీ ఎన్నికల ఫలితాలు మరోమారు  రుజువు చేశాయి. ఉత్తర ప్రదేశ్ లో ఘోరపరాజయం పాలైన బీజేపీని ఉద్దేశించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య  తన దైన శైలిలో స్పందించారు. రెట్టింపు సంతోషంతో తన స్వరాన్ని పెంచారు. ట్విటర్‌ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు ఉపన్యాసాలు తగ్గించుకోండి' అంటూ హితబోధ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధ పడుతోందంటూ పుండుపై కారం చల్లారు. చారిత్రాత్మక విజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించిందంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

అదే సమయంలో సీఎం ఆదిత్యనాథ్‌ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు. ముందు ఆయన ఉండే చోటులో అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై దృష్టిని సారించింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపై అని చెప్పింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికలు, పైగా దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ ఆదిపత్యం కొనసాగిన చోట ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏదేమైనా గెలిచినప్పుడు గర్వపడకుండా ఉంటే, ఓడినప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిన పనుండదు. లెనిన్ ఆత్మఘోస బీజేపీని ఊరికే వదిలిపెట్టలేదు ఓటమి రూపంలో వెంటాడిందని కొందరు కాషాయ పార్టీపై చలోక్తులు విసురుతున్నారు.