బీకాంలో ఫిజిక్స్ పవన్ పై ఫైర్

Posted on : 15/03/2018 03:18:00 pm

ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోపణలు, అన్ని రాజకీయ పక్షాలపైనా, ఏ పార్టీనీ వదలకుండా విమర్శలు గుప్పించాడు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్. తాజాగా "బీకాంలో ఫిజిక్స్" ద్వారా అత్యంత పాపులారిటీ సంపాదించిన తేదేపా  ఎమ్మెల్యే జలీల్ ఖాన్, విజయవాడ దుర్గ గుడి పార్కింగ్ దగ్గర డబ్బులు దండుకుంటున్నారన్న పవన్  ఆరోపణలపై  మండిపడ్డారు. ఆ ఆరోపణలు నిజమని రుజువు చేసిన పక్షంలో తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఆయన గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్‌ విసిరారు. బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్‌ కల్యాణ్‌ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని ఆరోపించారు. మంత్రి లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. బీకాంలో ఫిజిక్స్ ఉందన్నంత మాత్రానా ఏమన్నా ఊరుకుంటారా ఏంటి? ఎంతైనా ఆయనా రాజకీయ నాయకుడే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే.

ఒకసారి రాజధాని ప్రాంతాన్ని చూస్తే అభివృద్ధి ఏం జరుగుతుందో కనిపిస్తుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ సభ పెడుతున్నారంటే? ప్రత్యేక హోదాపై గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ ఆయనేమో అసలు విషయం గాలికి వదిలేశారని తెలిపారు. ప్రధాని మోదీని ఒక్కమాట అనని పవన్‌,  జనసేన వల్లే టీడీపీ గెలిచినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన, బీజేపీ పార్టీలు లేనప్పుడే మెరుగైన ఫలితాలు సాధించామని, ఆ పార్టీలతో కలిసిన తర్వాతే తమ ఓటు బ్యాంక్‌ తగ్గిందని జలీల్‌ ఖాన్‌ వెల్లడించారు.