బీజేపీతో విడాకులకు రేపే ముహూర్తం ఖరార్

Posted on : 15/03/2018 03:31:00 pm

ఎంత వరకు వాస్తవమో తెలియదు గానీ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసిన ఓ సంఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. అదే ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించిన, ఎన్డీయే నుంచి తేదేపా బయటకొచ్చేదెప్పుడనే ప్రశ్న, ఇంత కాలం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్ర మంత్రివర్గం నుంచి  తన మంత్రులను రాజీనామా చేయించిన చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చే విషయం పై ఇంతకాలం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ ముహూర్తం కూడా దగ్గర పడిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అందుకు పవన్ నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ కూడా ఒక కారణమనే గుసగుసలు సైతం అక్కడక్కడా వినిపించాయి. ఆ గుసగుసలేంటో అసలు చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చే వ్యవహారమేంటో ఒకసారి చూద్దాం.

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పవన్ ఆవిర్భావ సభ తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. జనసేనానికి కౌంటర్లు వేస్తున్న టీడీపీ... ఆయన వెనుక బీజేపీ ఉందనే వాదనను బలంగా వినిపిస్తోంది. అటు బీజేపీ కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ వాయిస్ పెంచడంతో, చంద్రబాబు రూటు మార్చారు. తాజా రాజకీయంపై చంద్రబాబు ఉదయం పార్టీ సమన్వయ కమిటీతో పాటు , ఎంపీలతో కీలక చర్చలు జరిపారు. అలాగే ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ అధినేత మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ,ఎన్డీయే నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

బీజేపీ తీరుతో అసంతృప్తితో ఉన్న చంద్రబాబు ,నేతల దగ్గర కూడా ఆ పార్టీ తీరుపై మండిపడ్డారని సమాచారం. టీడీపీకి వ్యతిరేకంగా ఏపీలో ఉన్న రాజకీయ పక్షాలను కూడగట్టే ప్రయత్నంలో ఉందనే అభిప్రాయంలో ఉన్నారు. ఇదే క్రమంలో రేపు సాయంత్రం పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో ప్రధానంగా తాజా రాజకీయాలు, ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు భేటీ నిర్వహించారు. వైసీపీ జనసేన వెనుక బీజేపీ ఉందని , వారి ఆరోపణల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేతలతో టీడీపీ అధినేత అన్నారట. అలాగే పోలిట్ బ్యూరో ఎజెండాపైనా చర్చించినట్లు సమాచారం.