ఈ నెల 23న వస్తున్న ప్రభుదేవా గులేబకావళి

Posted on : 15/03/2018 03:38:00 pm

నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా హీరోగా, హాన్సిక హీరోయిన్‌గా, ప్రముఖ నటి రేవతి ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం గులేబకావళి. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో కూడా అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అనువదిస్తున్నారు. ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిర్మాత మల్కాపురం శివకుమార్ సినిమా విశేషాలు తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు నేటివిటికి బాగా దగ్గరగా వుంటుందని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నానన్నారు. 

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుందని, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా ఉంటాయన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ స్టంట్స్ మరో ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.ఈ సినిమాకి వివేక్ మెర్విన్ సంగీతం సమకూర్చారు. ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్ ఛాయాగ్రహణం అందించారు.