థర్డ్ ఫ్రంట్ కి అజెండా అక్కర్లేదన్న కేటీఆర్

Posted on : 15/03/2018 03:45:00 pm

తెలంగాణ రాజకీయాల్లో తమ దైన ముద్రవేసిన కుటుంబం ఏదైనా ఉందా అంటే? అది కచ్చితంగా కేసీఆర్ కుటుంబమే. రాజకీయాలల్లో ఆ కుటుంబ సభ్యులు ఎవరికెవరూ తీసిపోరు. ప్రత్యేకించి థర్డ్ ఫ్రంట్ కోసం మాట్లాడుతూ దీనికి ఏవిధమైన అజెండా లేదని కేసీఆర్ విధానాలే ఆయన నేతృత్వం వహించే పార్టీకి ప్రత్యేక అజెండా అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తన తండ్రి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ, గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న మోదీ మాదిరిగానే తన తండ్రి కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని కేటీఆర్ అన్నారు.

గురువారం శాసనసభ లాబీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ దీనిపై మరోసారి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఎజెండానే జాతీయ ఎజెండా కానుందని, పది పార్టీలతో కూటమిని ఏర్పాటుచేసే ప్రయత్నం తాము చేయడం లేదని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ...తన నమూనా పేరుతో ‌ఎలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారో, సీఎం కేసీఆర్ కూడా అదే విధంగా ముందుకు వెళతారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు ‌కేసీఆర్ ఆలోచన విధానాన్ని ప్రజలు సమర్ధిస్తున్నట్లుగా ఉన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలు పట్టించుకొనే పరిస్ధితి లేదని, వారిది అధికార ఆరాటమేనన్న సంగతి తెలిసిపోయిందన్నారు ఎద్దేవా చేశారు. ప్రజల ఆశయాల కోసమే ఆనాడు శాసనసభలో హరీశ్‌రావు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుంటే అధికారం కోసం కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని దుయ్యబట్టారు.

తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి రుణం తీర్చుకున్న కేసీఆర్, భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భరతమాత రుణం కూడా తీర్చుకుంటారని ఉద్ఘాటించారు. ఇప్పుడు అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని, కేసీఆర్ సరికొత్త రాజకీయాలకు దేశం యావత్తు స్పందిస్తోందని అన్నారు. సామాన్యులకు ఏం కావాలో అదే కేసీఆర్ అజెండాగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని, అక్కడ ఎస్పీ గెలుపుతో ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఇకపై నమ్మే స్థితిలో లేదని, కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.