ప్రాంతీయ పార్టీలదే రాజ్యం - జాతీయ పార్టీల పనైపోయినట్లే

Posted on : 15/03/2018 03:56:00 pm

"ఒకే దెబ్బకు రెండు పిట్టలు" ఇది పాత సామెత, ఒకే విమర్శతో రెండు అంతకన్నా ఎక్కువ పార్టీలకు చురకలంటించొచ్చని, తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ నిరూపించారు.  యూపీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఓ వైపు వేదాంతం లాంటి వాస్తవం మాట్లాడుతూనే, రెండు జాతీయ పార్టీలకు  తనదైన శైలిలో చురకలంటించారు కేటీఆర్. అధికారం అనేది శాశ్వతం కాదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. ఇదే విషయాన్ని స్పష్టమైన సందేశంగా ఢిల్లీకి యూపీ పంపించిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. ఏదీ శాశ్వతం కాదని మరోసారి ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ద్వారా స్పష్టమైందని కేటీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర తగ్గిపోయిందన్న కేటీఆర్‌ , ఆఖరికి జాతీయ పార్టీలకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైన విషయం తెలిసిందే.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో రిహార్సల్‌గా భావించిన ఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్‌ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. 20 ఏళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో ఒప్పందం చేసుకొని బీజేపీని ఓడించాయి. ఈ నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఇదికోలుకోలేని దెబ్బ అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా స్పందించారు.