తెలంగాణాలో టీఆరెస్ ను బొందపెట్టడమే తమ లక్ష్యమంటున్నారు

Posted on : 16/03/2018 10:02:00 am

తెలంగాణ రాజకీయాల్లో "బొందపెడతా"అనే డైలాగ్ అవలీలగా వాడగల ఒకే ఒక రాజకీయనేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే, ఇది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఈ మాటను టీ కాంగ్రెస్ నేతలు ఓన్ చేసుకున్నారు. ఈ డైలాగ్ ను కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ వాడేశారు అది కూడా మామూలు సందర్భంలో కాదు. తెలంగాణా లో అధికార టీఆరెస్ను బొంద పెట్టే వరకూ విశ్రమించేది లేదని టీ కాంగ్రెస్ నేతలు ప్రతిన బునారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించినందుకు నిరసనగా గాంధీభవన్‌లో చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీఏసీ చైర్మన్‌ గీతారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్‌ భావోద్వేగంతో మాట్లాడారు. ‘గతంలో ఇదే గవర్నర్‌ను చేయిపట్టి గుంజి, ఆయన టేబుల్‌ ఎత్తుకెళ్లి, బెంచీలు ఎక్కి, మైకు విరిచిన వ్యక్తి హరీశ్‌రావు. కానీ మేం ఏమీ చేయకున్నా మమ్మల్ని సభ నుంచి బహిష్కరించే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేసిన మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగజారి బహిష్కరించింది. అందుకే ఆ పార్టీని అంతమొందించేంత వరకు పోరాడతాం’అని శపథం చేశారు. 

 ఇదిలా ఉంటే మరో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌కు దళితులు, బీసీలు, రెడ్లు అంటే భయం పట్టుకుందని, అందుకే వారి పట్ల విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘టీఆర్‌ఎస్‌లో చేరాలని, డబ్బులు ఇస్తామని నాపై చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు. నా భార్య ఉద్యోగంపై విచారణ జరిపారు. నా తమ్ముడి కాంట్రాక్టులను రద్దు చేశారు. అయినా వినకపోవడంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనంత దుర్మార్గ రాజకీయాలకు కేసీఆర్‌ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని, తాను మరణిస్తే కాంగ్రెస్‌ జెండా కప్పాలని కోరుకుంటున్నట్లు ఆవేశంగా మాట్లాడారు. సమావేశంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, పద్మావతి, దొంతి మాధవరెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్‌ రెడ్డి, పార్టీ నేతలు బలరాంనాయక్, మల్లు రవి తదతరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దీక్షకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయులు దేవులపల్లి అమర్‌ సంఘీభావం ప్రకటించారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారని,
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అంటే గిట్టదు. కేవలం ఒక సామాజిక వర్గం మనుషులు, తన కుటుంబం, కొంతమంది తప్ప రాష్ట్రంలోని 4 కోట్ల మంది అంటే ఆయనకు పడదు. గజ్వేల్‌ నియోజకవర్గంలో జనం చచ్చిపోతున్నా ఏనాడు వారి వంక కనీసం కన్నెత్తి చూడని కేసీఆర్‌ ,నల్లగొండకు వచ్చి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ కేసీఆర్‌ కి ఎవరూ ఓట్లేయరు. ఇటీవల నేను గజ్వేల్‌కు వెళ్లాను. అప్పటి నుంచి నాపై సీఎం కక్ష కట్టారు’అని ఆరోపించారు. ఓ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయాలంటేనే మూడుసార్లు నోటీసులిస్తారని, అలాంటిది ఓ ఎమ్మెల్యేలను ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని నిలదీశారు. తామంటే కేసీఆర్‌కు భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే నల్లగొండకు వచ్చి తనపై పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్‌ చేశారు. కేసీఆర్‌ అయినా ఆయన కుటుంబ సభ్యులైనా తనపై పోటీకి దిగితే ఓడిపోవడం ఖాయమన్నారు. మంత్రులంతా కలసి నల్లగొండలో తిష్ట వేసినా తనను అడ్డుకోలేరని, తాను ఓడిపోతే గాంధీభవన్‌ మెట్లు కూడా ఎక్కనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన దీక్షకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏదేమైనా నిన్నటి వరకూ ఓ లెక్క ఇప్పుడొక లెక్క అంటూ టీ కాంగ్రెస్ నేతలు టీఆరెస్ పై రగిలిపోతున్నారు.