మూడు దశాబ్దాల నట ప్రయాణం జగపతిబాబుది. ఈ ప్రస్థానంలో ఎన్నో  ఉత్థ" /> మూడు దశాబ్దాల నట ప్రయాణం జగపతిబాబుది. ఈ ప్రస్థానంలో ఎన్నో  ఉత్థ" />

నిజ జీవితంలో విలన్‌ని కాదు

Posted on : 21/10/2018 08:49:00 am

మూడు దశాబ్దాల నట ప్రయాణం జగపతిబాబుది. ఈ ప్రస్థానంలో ఎన్నో  ఉత్థానపతనాలు చూశారు. ‘కథానాయకుడిగా జగపతిబాబు పనైపోయింది’ అనుకుంటున్న దశలో ‘లెజెండ్‌’ వచ్చింది. అది ఆయన జీవితాన్ని అనూహ్యమైన మలుపు  తిప్పింది. ప్రతినాయకుడిగా తానెంత విలువైన నటుడో ఆ సినిమాతో  నిరూపితమైంది. అక్కడి నుంచి జగ్గూభాయ్‌కి చిత్ర సీమ ఎర్ర తివాచి పర్చింది. స్టార్‌ కథా నాయకుల చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటిస్తూ, తనలోని విభిన్న కోణాల్ని  ఆవిష్కరించుకుంటున్నారు. తాజాగా ‘అరవింద సమేత వీర రాఘవ’లో బసిరెడ్డిగా ఆయన పాత్ర ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా  శనివారం హైదరాబాద్‌లో జగపతిబాబు విలేకరులతో మాట్లాడారు.

‘‘అరవింద సమేతలో నా పాత్ర బాగుంటుందని నాకు ముందే తెలుసు. కానీ ఇంత ఆదరణ వస్తుందని అనుకోలేదు. త్రివిక్రమ్‌ అంటే ఇష్టం, గౌరవం. తారక్‌ అంటే చాలా అభిమానం. అందుకే ఈ సినిమా చేశా. ‘మీరు లేకపోతే సినిమా లేదు’ అని తారక్‌ చెబుతుండేవాడు. నాదృష్టిలో సినిమానే అన్నింటికంటే పెద్దది. ఆ తరవాతే నటీనటులు, స్టార్లు’’. ‘‘కథానాయకుడు, ప్రతినాయకుడు అనేం లేదు. సినిమాయే ముఖ్యం. పాత సినిమాల్ని చూడండి. కథానాయకులపై ప్రతినాయకులైన ఎస్వీఆర్‌, గుమ్మడి, నాగభూషణం ఆధిక్యతని కనబరిచేవాళ్లు. అంతెందుకు ‘శుభలగ్నం’ చిత్రంలో ఆమని పాత్ర నన్ను బాగా డామినేట్‌ చేస్తుంది. ఆ కథలు అలాంటివి’’.  ‘‘బసిరెడ్డిగా రాయలసీమ యాసలో నేను చెప్పిన సంభాషణలూ, నటనా ఆ ప్రాంత వాసులకు బాగా పట్టేసింది. పెంచలదాసు రాయలసీమ యాసలో రాసిన సంభాషణలే ఈ పాత్రని ఇంతలా నిలబెట్టాయి. గొంతు పోయినా, రక్తం వచ్చేంత పనైనాసరే అనుకుని చాలా కష్టపడి డబ్బింగ్‌ చెప్పా. అందుకు తగిన ఫలితమే వచ్చింది’’. ‘‘రంగస్థలం’లో కన్నా క్రూరమైన పాత్ర చేశానని కొంతమంది అంటున్నారు. ఇలా వరుసగా విలన్‌ పాత్రలు చేస్తుండడంతో నన్ను ఆ దృష్టితో చూస్తున్నారు. నేను సినిమాల్లోనే విలన్‌ని... జీవితంలో కాదు. (నవ్వుతూ). నాకైతే అప్పుడప్పుడూ గాఢ్‌ఫాదర్‌ తరహా పాత్రలు చేయాలనివుంది. సున్నితమైన భర్తగానూ కనిపించాలనుంటుంది. అదీ నా వయసుకి తగ్గట్టుగానే’’. ‘‘నాకు అంతగా నటన రాదు. ఓ దశలో ఎలా నటించాలనే మీమాంసలో పడ్డాను. రామ్‌గోపాల్‌వర్మని సలహా అడిగా. ‘అన్ని సినిమాలూ చూడు. రాను రాను ఎలా చేయాలనేది నీకే తెలుస్తుంద’ంటూ సలహా ఇచ్చాడు. నానా పటేకర్‌, ప్రకాష్‌రాజ్‌ నటించిన సినిమాలు చూస్తుండేవాడ్ని. చూస్తూ చూస్తుండగా నాలో ఏవో ఆలోచనలు వచ్చేవి. ఆచరించేవాడిని. అంతేగానీ నాకు నటనలో ఎవరూ ప్రేరణంటూ లేరు. చూసినోళ్లను కాపీ కూడా చేయలేదు’’.  ‘‘నటనకి భాష అడ్డంకి కాదు. తమిళ, మలయాళం భాషల్లో చేస్తున్నాను. బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నా. భారతీయ భాషలన్నింటిలనూ నటించాలనుంది. ‘సైరా’లో ఓ కీలకపాత్ర చేస్తున్నా. ప్రస్తుతం చేస్తోన్న పాత్రలకి చాలా విభిన్నంగా ఉంటుంది’’.