విశాఖకు రైల్వేజోన్ వస్తుందంటోన్న బీజేపీ నేత

Posted on : 19/03/2018 09:50:00 am

నిన్నటి వరకూ పాలు పంచదారలా కలిసున్న తేదేపా, బీజీపీలు ఇప్పుడేమో ఉప్పు నిప్పులా మారిపోయారు. తేదేపా అధికారానికి కేవలం జనసేన అధ్యక్షుడు పవన్, ప్రధాని మోదీనే అంటున్నాడు విశాఖ బీజేపీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు. ఈ విషయంలో ఏమాటకామాటే చెప్పుకోవాలి, విష్ణుకుమార్ రాజు కాస్త అతే చేశారని చెప్పక తప్పదు ఏపీలో అంతగా ప్రాబల్యం లేని బీజేపీకి తేదేపా వల్లనే ఏపీలో ఆకాస్త గెలుపైనా సాధ్యమైందన్నది వాస్తవం. అయితే బీజేపీ మాత్రం ఏపీలో తేదేపా గెలవడానికి తామే కారణమంటున్నారు. లేకుంటే ప్రతిపక్షానికే పరిమితమవ్వాల్సి వచ్చేదంటున్నారు. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేయడంతో బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. తమతో పొత్తుపెట్టుకోవడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, పవన్ కల్యాణ్ మద్దతు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో టీడీపీ పొత్తు పెట్టుకోకపోయి, పవన్ ప్రచారం చేయకుంటే వైసీపీ అధినేత జగన్ సీఎం అయ్యేవారని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉండేదని దుయ్యబట్టారు.


టీడీపీ తమకు మిత్రపక్షం కాబట్టే ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, ఇకపై అలా ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి రావడానికి కారణం తానేనని, తనవల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని తెలిపారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిపోయిందని, ఇకపై రాష్ట్రంలో తాము ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్‌ తప్పకుండా వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడమేంటని అన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు మాటమార్చడం వెనుక ఆంతర్యం ఏంటని విష్ణుకుమార్ రాజు నిలదీశారు.