దేశంలో అందరి టార్గెట్ మోదీ సర్కార్ ని గద్దెదింపడమే

Posted on : 19/03/2018 10:46:00 am

మర్రి చెట్టు నీడలో చిన్న చెట్లు ఎదగలేవన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇది పాత మాట, అంత పెద్ద మర్రిచెట్టును కూడా చిన్న  రంపం కోయగలుగుతుందనేది కేసీఆర్ వేస్తోన్న బాట. ఈ కథలో మర్రిచెట్టు మాత్రం దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఒకటైతే, ఇప్పుడు దేశంలో రోజు రోజుకీ తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న బీజేపీ రెండోది. అయితే రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్నది కేసీఆర్ కోరిక, అక్కడి నుంచి పట్టుకొచ్చిందే థర్డ్ ఫ్రంట్ ఎన్డీయే వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకం చేసి ఆ రెండు జాతీయ పార్టీల విజయాలకు అడ్డు కట్ట వేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మోదీ ప్రభుత్వ పాలనలో మైనార్టీలపై దాడులు జరగుతుండడం, యూపీలో పరిస్థుతులు, విగ్రహాల ధ్వంసం, రకరకాల చర్యలతో దేశంలో కాషాయ మూకలు అరాచకాలు సృష్టిస్తున్న ఘటనలు ప్రజల్లో బీజేపీ పై వ్యతిరేకతను పెంచుతాయనడంలో సందేహమే లేదు. ఒక రకంగా కేసీఆర్ ఎన్డీయే పై వార్ డిక్లేర్ చేసినట్లే.

టీఆరెస్ అధినేతకు ప్రధాని అవ్వాలనే కోరిక పక్కన పెడితే ప్రస్తుత ప్రధానిని గద్దె దించాలన్నదే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని స్పష్టం అవుతోంది. దీంతో తెలంగాణా రాజకీయాలు ఎన్డీయేకు పచ్చి వెలక్కాయ పడినట్లే. తాచెడ్డకోతి వనమంతా చెరిచినట్లు కేసీఆర్ ప్రాంతీయపార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, వచ్చే ఎన్నికలకల్లా వార్ జోన్ లో గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనబడుతోంది. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనచట్టంలోగల హామీల అమలులో విఫలమైందంటూ ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తేదేపా కూడా మోదీకి పక్కలో బల్లెంలా తయారయ్యిందని చెప్పక తప్పదు. శివసేనది దాదాపు అదే పరిస్థితి. ఇప్పటి వరకూ ఇరవైకు పైగా రాష్ట్రాల్లో తన హవా కొనసాగిస్తున్న బీజేపీ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతోంది. ఎన్డీయేకు ప్రధాన పోటీ దారు  యూపీఏ కూడా,దేశంలో  ఎన్డీయే పాలన అంతుచూసేందుకు కంకణం కట్టుకుంది. ఏరకంగా చూసిన ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీల టార్గెట్ మోదీ సర్కార్ని గద్దె దింపడమే అన్నది స్పష్టమవుతోంది..