యూపీలో డేంజర్ బెల్స్ మోగినా బీజేపీ బలుపు తగ్గలేదు

Posted on : 19/03/2018 12:43:00 pm

ఈ శతాబ్దం నాదని చెప్పడం ఒకే ఒక్కరికి సాధ్యమైంది, అది కూడా ఆయన చేతిలో కలానికున్న పవర్ అలాంటింది. ఆయన పట్ల సాహిత్యాభిమానులుకున్న క్రేజ్ అలాంటిది. కవిత్వంపై ఆయనకున్న పట్టు అంత గొప్పది ఆయనే మహాకవి శ్రీశ్రీ. అలా ఈ శతాబ్ధం నాదని చెప్పడం ఆయన గెలుపు తప్ప బలుపు కాదు అది అందరికీ తెలిసిందే. ఇంచుమించు అలాంటి మాటలే నేటి రాజకీయాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోట వినబడుతున్నాయి. 2019 లోనే కాదు ఆపై వచ్చే ఎన్నికల్లో కూడా మాదే గెలుపంటున్నాడు అమిత్ షా ఇది మాత్రం కచ్చితంగా బలుపే అంటున్నారు కొందరు. దేశరాజకీయాల్లో ఏపూట ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో ఈ రోజుల్లో చెప్పడం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఉదాహరణ యూపీ ఎన్నికల ఫలితాలే. ఆ ఫలితాలిచ్చిన అనుభవం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోక పోగా బీరాలు పలుకుతోంది బీజేపీ. ఓ వైపు ఆంధ్రా, తెలంగాణా నుంచి కేంద్రానికి ప్రతికూల వాతావరణం, యూపీలో ఇదివరకే మోగిన డేంజర్ బెల్స్ ఆ పార్టీ భవిష్యత్తులో బలహీన పడుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు.

జీ ఇండియా కాంక్లేవ్ కు   హాజరైన అమిత్ షా తమ విజయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో కంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి 2019లోనే  కాదు 2024 కూడా తమదేనని, బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని ఆయన తేలిగ్గా తీసి పారేశారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆయన స్పందిస్తూ, ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందన్న విషయాన్ని సైతం ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కి సంఖ్యాబలం తగ్గుతుందన్న భయం తమకు లేదన్నారు. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమే కానీ, ప్రతిపక్షాలు సభను జరగనివ్వటం లేదన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఓటమి తప్పదని విపక్షాలకు తెలుసని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

2019 ఎన్నికల్లో తమను ఎదుర్కోవటానికి అన్ని పార్టీలు చేతులు కలపటం చూస్తుంటే, తమ బలం ఏమిటన్నది అర్థమవుతుందన్నారు. గతంలో ఇందిరా వర్సెస్ మిగిలిన పార్టీలని అనేవారని.. ఇప్పుడుపరిస్థితి మారి, మోదీ వర్సెస్ మిగిలిన పార్టీలుగా మారిందన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఓటమికి బీజేపీ పెద్దగా ఫీలవుతున్నట్లు లేదన్న విషయం ఆయన షా మాటల్లో వ్యక్తమవుతోంది. యూపీలో పార్టీ మరింత వృద్ధి చెందుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. యూపీలో రాజకీయ ఉనికి సంక్షోభంతో ఎస్పీ ,బీఎస్పీ రెండు పార్టీలు చేతులు కలిపాయన్నారు. కాంగ్రెస్ నుంచి తాము 11 రాష్ట్రాల్ని కైవశం చేసుకున్నామని, తాము కొన్ని ఉప ఎన్నికల్లో ఓటమి చెందగానే విపక్షాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నారు. ఇన్ని గొప్పలకు పోతున్న బీజేపి తమ కంటే ముందు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏలిన సంగతి మర్చిపోయి మాట్లాడు తున్నారు. రాజకీయాల్లో ఏదీ శాస్వతం కాదు. గెలుపైనా..ఓటమైనా..అది తాత్కాలికమే మాటలు చెప్పినంత ఈజీగా ఓట్లు కొల్లగొట్టడం అంత సులభం కాకపోవచ్చు ముందు ముందుకి. నోట్ల కష్టాలు ప్రజలకు ఓట్ల పండగ బీజేపీకా అనే నినాదాలు ప్రజలనుంచి రానంత వరకే ఎవరెన్ని బడాయి మాటలు మాట్లాడినా జరిగే వరకూ ఎవరిదైనా రాజరికమే ఆ తరువాత కోటలకు బీటలు పడే రోజొచ్చాక గానీ అసలు విషయం తెలిసిరాదు.