స్మార్ట్‌ఫోన్‌ వాడకం.. చేతివేళ్లు వంగిపోయాయి!

Posted on : 23/10/2018 09:44:00 pm


నేటి యువత ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకూ స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అతిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఆరోగ్యానికి హానికరం. కానీ కొంతమంది మాత్రం నిరంతరం స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే ఉంటున్నారు. తాజాగా.. చైనాకు చెందిన ఓ యువతి అదే పనిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వల్ల తన చేతి వేళ్ల కదలికను కోల్పోయింది. ఫోన్‌ను ఏ విధంగా అయితే పట్టుకొని ఉందో.. అదే రీతిలో ఆమె వేళ్లు బిగుసుకుపోయాయి. వైద్యుల చికిత్స అనంతరం ఎట్టకేలకు ఆమె చేతి వేళ్లు మళ్లీ మామూలు స్థితికి వచ్చాయి.

చైనాకు చెందిన షాంఘైలిస్ట్‌ కథనం ప్రకారం.. హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌కు బానిస. తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టి మరీ సమయాన్నంతా ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంది. కేవలం నిద్రపోయే సమయంలో మాత్రమే ఫోన్‌ను వదిలిపెట్టేది. ఇలాగే రోజు చేయడంతో చేతులు నొప్పి పెట్టి.. చివరికి ఆమె వేళ్లు వంగిపోయి బిగుసుకుపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా పట్టుకుని ఉందో అదే పొజిషన్‌లో ఆమె వేళ్లు కూడా ఉండిపోయాయి. తిరిగి మామూలు స్థితికి రాలేకపోయాయి. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. అదృష్టవశాత్తూ ఆమె వేళ్లను వైద్యులు తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగారు. కానీ ఆమె స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.