ఉద్యమ పథంలో ‘ప్రత్యేక హోదా’

Posted on : 22/03/2018 11:04:00 am

ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరు తీవ్రరూపం దాల్చి ఉద్యమ పంథాగా మారుతోంది.  ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపిచ్చిన నేపథ్యంలో 13 జిల్లాల్లోనూ గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రధాన రాజకీయపక్షాలన్నీ నిర్ణయించాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహించే కార్యక్రమమైనందున నిరసనకు నైతిక మద్దతును తెలియజేస్తున్నామని టీడీపీ పేర్కొంది. అధికార టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు భారీగా రహదారులపై రాకపోకలను అడ్డుకోనున్నాయి.  టీడీపి అధికార పార్టీ అయినందున ప్రత్యక్షంగా బంద్‌లూ, రాస్తారోకోలలో పాల్గొనడం లేదు. టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది. ఆందోళన ముసుగులో వైసీపీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని, రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో వైసీపీతో పాల్గొనవద్దని టిడిపి కార్యకర్తలకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నేతలకు స్పష్టంగా ఆదేశించారు.  వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్‌ పార్టీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు జాతీయ  రహదారుల దిగ్బంధానికి సంపూర్ణ మద్దతును ప్రకటించించారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా నిరసన తెలపాలని సూచించారు. 

అన్ని రాజకీయ పక్షాలూ రహదారుల దిగ్బంధనానికి మద్దతు తెలపడంతో కార్యక్రమం విజయవంతం అవుతుందని, హోదా డిమాండ్‌ మరోసారి గట్టిగా వినిపించే అవకాశముందని అంటున్నారు. హోదా ఏ ఒక్కరితోనో సాధ్యమయ్యేది కాదని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. గురువారం రహదారుల దిగ్బంధం నేపథ్యంలో పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనులపై వెళ్లేవారంతా ఉదయం 10గంటల కంటే ముందే గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా జరుగుతున్నందున ఎలాంటి అసౌకర్యం లేకుండా నగర పోలీసు శాఖ భారీ బందోబస్తుతో పాటు ముందస్తు ట్రాఫిక్ జాగ్రత్త చర్యలు చేపట్టింది.