బిడ్డా.. నీ జ్ఞాపకం పదిలం!

Posted on : 05/01/2018 03:14:00 pm


ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా బిడ్డలను క్రీడల్లో ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రత్యేక శిక్షణ, శిక్షకుల వద్ద చేర్పించేవారు మరి కొందరు. ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమిస్తూ.. ఆడే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే జ్ఞాపకార్థం క్రీడోత్సవాన్ని నిర్వహిస్తూ.. క్రీడాభిమానాన్ని చాటుకుంటున్నాడు ఈ తండ్రి. రెండేళ్లుగా రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తూ అంతరాష్ట్ర ఫుట్‌బాల్‌ పగలు, రాత్రి నిర్వహించే క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. విజేత, నిష్క్రమణ జట్లకు నగదు, జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో శుక్ర, శని, ఆదివారాల్లో జరగనున్న క్రీడోత్సవంపై ప‌క్షం ప్ర‌త్యేక క‌థ‌నం..

ఇదిగో ఇలా..
జహీరాబాద్‌ మండల అల్లిపూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ జమీలుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ విఖార్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతూ.. రెండేళ్ల క్రితం బీదర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఫుట్‌బాల్‌ ఆటపై అమితాసక్తి కనబరిచే కుమారుడి కోసం క్రీడాకారులను ప్రోత్సహించాలని సంకల్పంతో పోటీలు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో విఖార్‌ మెమోరియల్‌ ఛాలెంజ్‌ ట్రోఫీలో ఉమ్మడి మెదక్‌ జిల్లా, హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని బీదర్‌, గుల్బర్గా, ముంబయి, పర్బనీ, జాల్న, నాందేడ్‌ ప్రాంతాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఆటలను ఉదయం 10:30 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. క్రీడోత్సవాల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు బస, విడిది సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్రీడా మైదానంలో ఫ్లడ్‌ లైట్ల బిగింపు, మైదానం చదువు చేయడం.. ఇతరాత్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. విజేత జట్టుకు రూ.20 వేలు, నిష్క్రమణ జట్టుకు రూ.15 వేలు అందజేయనున్నారు.

క్రీడకు ప్రోత్సాహం..: జమీలుద్దీన్‌, విఖార్‌ తండ్రి
క్రీడలను అమితంగా ఇష్టపడే కుమారుడి జ్ఞాపకార్థం టోవర్నమెంట్‌ నిర్వహించడంతో బిడ్డకు నిజమైన నివాళిగా భావిస్తున్నా. యువ క్రీడాకారులను ఈ విధంగా ప్రోత్సహించే అవకాశం రావడం సంపృప్తినిస్తుంది.