నటుడు ధనుష్‌పై మళ్లీ కేసు

Posted on : 27/10/2018 01:54:00 pm


నటుడు ధనుష్‌ తన కుమారుడని ఇంతకు ముందు మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్ష్మి దంపతులు చెన్నై హైకోర్టు శాఖ మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కధిరేశన్‌ దంపతుల వాదనలో నిజం లేదం టూ నటుడు ధనుష్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు, ప్రతి వాదనలు విన్న మదురై న్యాయస్థానం కధిరేశన్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. అయినా కధిరేశన్‌ పట్టువిడువని విక్రమార్కుడిలా ధనుష్‌పై పోరాడుతూనే ఉన్నాడు.

ఆయన తాజాగా మదురై జేఎం.6 కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో నటుడు ధనుష్‌ తన కుమారుడేనని, ఈ విషయమై మధురై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో ధనుష్‌ బర్త్‌ సర్టిఫికెట్, స్కూల్‌ సర్టిఫికెట్‌ తదితర నకిలీవి కోర్టుకు సమర్పించాడని పేర్కొన్నారు. ఈ విషయమై మధురై పోలీస్‌ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నకిలీ ఆధారా లతో తప్పించుకున్న నటుడు ధనుష్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు నవంబర్‌ 9న విచారణకు రానుంది.