కాసేప‌ట్లో లాలూకి శిక్ష ఖ‌రారు ..!

Posted on : 05/01/2018 03:27:00 pm

దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆర్జేడీ అధినేత‌ లాలు ప్రసాద్ యాదవ్‌తో పాటు మరో 15 మందిని గత నెల 23న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల నిధులను పక్కదారి పట్టించి, స్వాహా చేసిన‌ కేసులో వీరంతా దోషులుగా తేలారు. ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌కి ఏడు సంవత్సరాల శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిన్ననే ఈ కేసులో శిక్ష ఖ‌రారును ప్ర‌క‌టిస్తార‌ని భావించ‌గా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. శిక్ష ఖ‌రారును ఈ రోజు జ‌డ్జి శివ‌పాల్ సింగ్‌.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్ల‌డించ‌నున్నారు.
నా వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించండి
ఆర్జేడీ అధినేత, దోషి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, తన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించి వెల్లడించాలని లాలూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.