బాలీవుడ్ కండలవీరుడుకి ఊరట... జోధ్ పూర్ సెషన్స్ కోర్టులో

Posted on : 18/04/2018 03:37:00 pm

కృష్ణ జింకల వేట కేసులో బెయిల్‌పై ఉన్న బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో మరో ఊరట లభించింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో జోధ్‌పూర్‌లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయనకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, రెండురోజులు జైల్లోనే ఉన్న సల్మాన్‌కు రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే షరతులపై బెయిల్‌ మంజూరు అయిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలయిన తరువాత సల్మాన్ దేశం దాటి వెళ్లకూడదని కోర్టు షరతు పెట్టింది. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌', 'కిక్‌ 2', 'దబాంగ్‌ 3', 'రేస్‌ 3' చిత్రాల్లో నటించాల్సి ఉండడం, పైగా ఈ సినిమా చిత్రీకరణలన్నీ విదేశాల్లో జరగాల్సి ఉండడంతో, తనకు మూడు దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సల్మాన్‌కు విదేశాల్లో చిత్రీకరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సల్మాన్‌ మే 25 నుంచి జులై 10 వరకు కెనడా, నేపాల్‌, అమెరికాలో పర్యటించనున్నారు. కాగా సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు జోధ్‌పూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు మంగళవారం ప్రకటించింది. మే 25 నుంచి జులై 10 వరకు విదేశాల్లో పర్యటించేందుకు కోర్టు అంగీకరించడంతో సల్మాన్ 45 రోజులపాటు విదేశాల్లో ఉండనున్నాడు. అమెరికా, కెనడా, నేపాల్ దేశాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు.