రెండు చోట్ల నుంచి పోటీ....కర్ణాటక సిఎం సిద్ధరామయ్య

Posted on : 22/04/2018 01:58:00 pm

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం సిద్దరామయ్య రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడింది.  చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీకి ఆయన ఇప్పటికే నామినేషన్ వేశారు.  మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్‌కోట్‌ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. రెండవ స్థానంగా  బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్‌ వేయనున్నారని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 12 న పోలింగ్ జరగనుండగా,  ఫలితాలను మే 15 న వెల్లడించనున్న విషయం తెలిసిందే. 

బదామీ నుంచి కాంగ్రెస్ తరఫున డాక్టర్ దేవ్‌రాజ్ పేరును ఖరారు చేస్తూ ఏప్రిల్ 15 న జాబితా విడుదల చేశారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో సిద్ధ రామయ్య ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక ప్రక్క దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే, మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది.