సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా... ఏచూరి ఏకగ్రీవ ఎన్నిక

Posted on : 22/04/2018 03:02:00 pm

సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. దీంతో మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఈరోజు జాతీయ మహాసభల వేదికపై పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకోగా, 92 సభ్యులున్న కేంద్ర కమిటీ సంఖ్యను 95కు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్యలు కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతుండగా, తాజాగా, ఈ కమిటీలో నాగయ్యకు అవకాశం లభించింది. 

కేంద్రకమిటీ ప్రత్యేక ఆహ్వనితులుగా మల్లు స్వరాజ్యం కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్య ఎన్నికైయ్యారు. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ తామంతా ఏకతాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నామని తెలియజేశారు. 

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మలక్ పేట నుంచి ప్రారంభించనున్న రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో 20 వేల మంది దాకా పాల్గొంటారని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుండగా, సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ ఈడీ స్క్రీన్స్ సిద్ధం చేశారు.