వాంగ్మూలం ఎందుకివ్వలేదు : జగన్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం

Posted on : 09/11/2018 06:48:00 pm


విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాదికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది.

జగన్ తరఫు లాయర్ పైన ప్రశ్నల వర్షం కురిపించింది. దాడి అనంతరం పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. విశాఖపట్నంలో పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా విమానంలో హైదరాబాదుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం అడిగింది. ఏపీ పోలీసులకు విచారణకు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ప్రశ్నించింది.

అసలు గాయంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాలని కోర్టు ఆదేశించింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాఫ్తు తీరును ఆక్షేపించడం సరికాదని అభిప్రాయపడింది.

దీనిపై జగన్ తరఫు న్యాయవాది స్పందించారు. ఏపీ పోలీసుల తీరు తమకు నమ్మశక్యంగా లేదని, అందుకే జగన్ వారికి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. అలాగే ప్రాణాపాయం ఉన్నందునే స్టేట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు. 

అసలు గాయంతో విమానంలో ప్రయాణం చేయవచ్చా లేదా అనే విషయంపై స్పష్టత కావాలని, ఈ వివరాలు తెలుసుకొని తమకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ తరఫు లాయర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను సీల్డు కవర్‌లో ఇవ్వాలని అడ్వోకేట్ జనరల్‌ను ఆదేశించింది.