రాజకీయ పార్టీ ఏర్పాటు....ఐఐటీ విద్యార్థులు

Posted on : 23/04/2018 11:23:00 am

వెనకబడిన, అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడటమే తమ లక్ష్యంగా వివిధ ఐఐటీల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి తమ ఉద్యోగాలను త్యజించి ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు. ఐఐటీ పూర్వ విద్యార్థులు యాభై మంది ఒక బృందంగా ఏర్పడి 'బహుజన ఆజాద్‌ పార్టీ'(బీఏపీ)ని స్థాపించగా, ఢిల్లీ ఐఐటీలో 2015లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్ధి నవీన్‌కుమార్‌ ఈ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కు జాతీయ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చేలోగా క్షేత్రస్థాయి కార్యకలాపాలను మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికలు తమ లక్ష్యం కాదని ఈ బృందం స్పష్టం చేస్తూ, తమ అభిప్రాయాలను, పార్టీ లక్ష్యాలను తెలిపారు. 

2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.  ఆ తరువాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని వివరించారు. విద్య, ఉద్యోగంలో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని వారు పేర్కొన్నారు. తమ బృందంలో ఎక్కువగా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గానికి చెందిన వారున్నారని, సామాజిక మాధ్యమంలో డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం, మరికొంతమంది నాయకుల చిత్రాలతో పాటు తమ బృందంలోని కొందరు నాయకులతో ఉన్న ఒక పోస్టర్ తో  ప్రచారం చేపట్టామని తెలిపారు.