అభివృద్ధి పదాన అలుపెరగని బాటసారి నాదేశం..

Posted on : 06/01/2018 12:55:00 am

భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం... అభివృధ్ధి చెందుతూనే ఉన్న దేశం..!
అవును, పరాయి పాలన చెర నుండి స్వాతంత్య్రం తెచ్చుకోడానికి 400 సంవత్సరాలు పట్టిన దేశానికి
సొంత కాళ్ళ మీద నిలబడి అభివృధ్ధి సాధించడానికి ఆ మాత్రం సమయం పట్టదా..?
అయినా మనమేమీ వెనకబడిపోయిన దేశం కాదుగా..అభివృధ్ధి వైపు పయనిస్తున్న దేశం..!
కాని గమ్యం చేరుకోవడానికి ఎందుకింత సమయం పడుతుంది?
ఆ ప్రయాణానికి ఎంచుకున్న మార్గం సుదూరమైనదా...?
మార్గం సరైనదే... అవరోధాలే అనేకం...!!

కులాలు, మతాలు,రాజకీయాలు, సరిహద్దు గొడవలు, లంచ గొండి వ్యవస్థలు, మూఢ నమ్మకాలు, మూర్ఖపు జనాలు..

ఇలా చాలా అవరోధాలు దాటుతూ అలుపెరగకుండా అభివృధి వైపు పయనిస్తున్న దేశం..
ఇక్కడ భారత దేశం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, భారతీయులు కాదు.. అసలు భారతీయులే లేరిక్కడ.
ఫలానా కులం వారు, మతం వారు, ప్రాంతం వారు, పార్టీ వారు మాత్రమే ఉన్నారిక్కడ.
అంతర్యుద్ధాలు చేయడానికి కులాన్ని కవచం గా మతాన్ని మారణాయుధం గా వాడతారిక్కడ.

శత్రువులు దేశం మీదకి దండెత్తితే సైనికులున్నారుగా వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు. అదే వాళ్ళ కులాన్నో మతాన్నో కించ పరిచి చూడు ఖబడ్ధార్ అంటూ కత్తులూ కర్రలూ పట్టుకుని వీధుల్లోకొస్తారు..

అంతెందుకయ్యా మూడు వందల ఏళ్ళు బ్రిటీష్ వాళ్ళ దగ్గర మూసుకుని కూర్చున్న వాళ్ళు, స్వతంత్రం ఇస్తున్నామని మతాల వారిగా దేశాన్ని విడదీసి చిచ్చు పెడితే కాట్ల కుక్కల్లా కొట్టుకుని లక్షల  ప్రాణాలు తీసుకున్నారు  వాళ్ళ మతాల కోసం.

ఇవన్నీ మా వాళ్ళ వీరత్వానికి మచ్చు తునకలు మాత్రమే.. 70 ఏళ్ళ స్వాతంత్య్రం లో ఇలాంటి ఆణిముత్యాలు ఇంకెన్నో...
ఆ పౌరుష గాధలు పక్కన పెడితే ఇక్కడ రాజకీయాలు దేశం ఒక అడుగు ముందుకేస్తుంటే పది అడుగులు వెనక్కి లాగుతూ పండగ చేసుకుంటాయి..
మా తాతలు నేతులు తాగారు మా నాన్నలు వాళ్ళ మూతులు నాకారు మేము ఆ మూతుల వాసన చూస్తున్నాం అని తరతరాలుగా వారసత్వ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు
వీళ్ళకి దేశం గెలవడం ముఖ్యం కాదు వాళ్ళ పార్టీ గెలవడమే ముఖ్యం. అధికార పార్టీ ఒక చట్టం చేయాలంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుపడుతుంది.
అదే చట్టం అధికారంలోకి వచ్చాక వీళ్ళు అమలు చేస్తుంటే వాళ్ళు అడ్డుపడతారు... అధికారం లో ఉన్నప్పుడు ఒప్పైనది ప్రతిపక్షం లోకి రాగానే తప్పెలా అవుతుందో వాళ్ళకే తెలియాలి.

ఇక్కడ నేతలకి పదవులు ముఖ్యం కాని దేశ ప్రగతి ముఖ్యం కాదు... దేశాన్ని ముందుకు నడిపించాల్సిన నాయకులు నెత్తినెక్కి కూర్చుని కదలనివ్వకుండా చేస్తున్నా నా దేశం అడుగులు వేస్తూనే ఉంది.. కాని దారి నిండా అవినీతి అనే బురదని నింపేసారు ఈ నాయకులు.. ఆ బురదలో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క స్కాము బయటపడుతుంటే బయటి ప్రపంచం నవ్వుతుంటే సిగ్గుతో తల దించుకుని మౌనం గా అడుగులు ముందుకు వేస్తూనే ఉంది..

ఇక ఈ ప్రజాస్వామ్య దేశం లో ఓటు అనే వరమిచ్చి ప్రజల్ని దేవుళ్ళని చేద్దామని చూస్తే పల్లెం లో పడే చిల్లర కోసం గర్భగుడి వదిలేసి గుడి మెట్ల పైన బిచ్చగాళ్ళుగా మారిపోయారు..
రాజకీయ నాయకులు విటులైతే ఓటు అనే శీలాన్ని అమ్ముకుని ప్రజలు వ్యభిచారులైపోయారు.

చూసావుగా ఇది నా దేశం లో పరిస్థితి. ఇన్ని అవరోధాలు ఉన్నా కూడా నా దేశం వెనకబడిపోకుండా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది..ఏదో ఒక రోజు నా దేశం ఈ అవరోధాలనన్నిటినీ దాటుకుని అభివృద్ధి సాధిస్తుంది... ప్రపంచానికి ఒక ధిక్సూచిలా నిలుస్తుంది...అప్పటి వరకు నా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే ప్రయాణం సాగిస్తుంది.

- బ్రహ్మా బత్తులూరి