బిట్ కాయిన్ కు చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు : అరుణ జైట్లీ

Posted on : 06/01/2018 12:13:00 pm

భార‌త‌దేశంలో బిట్‌కాయిన్ వంటి వ‌ర్చువ‌ల్ క‌రెన్సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇటీవ‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారిన బిట్‌కాయిన్ వాడ‌కం గురించి లోక్‌స‌భ‌కు ఆయ‌న లిఖిత పూర్వ‌కంగా లేఖ‌లో తెలియ‌జేశారు. ఇప్ప‌టికే దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ సంస్థ‌లు ఏర్ప‌డ్డాయ‌ని, వాటి ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌ని, అది వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంలో మాత్ర‌మే ప‌నిచేస్తున్న కార‌ణంగా వాటి మార‌కం చెల్ల‌దని అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు.

బిట్‌కాయిన్ హెచ్చుత‌గ్గుల‌పై విశ్వ‌స‌నీయ‌త లేని కార‌ణంగా వాటి వాడ‌కాన్ని నిరోధించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యంపై విచార‌ణ కోసం ఇప్ప‌టికే ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి అధ్య‌క్ష‌త‌న ఓ క‌మిటీ కూడా వేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోక‌రెన్సీల గురించి ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసి, వాటికి సంబంధించిన స‌మస్య‌ల ప‌రిష్కారానికి స‌లహాలు, సూచ‌న‌ల‌తో నివేదిక త‌యారు చేయ‌నుంద‌ని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా, బిట్‌కాయిన్ వాడ‌కాన్ని ఇప్ప‌టికే కొన‌సాగిస్తున్న వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఆర్‌బీఐ హెచ్చ‌రికలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.