బన్నీ అన్నలాగా డాన్స్.. విజయ్ దేవరకొండ సంచలనం!

Posted on : 12/11/2018 07:53:00 pm


టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది మూడవ చిత్రంతో రాబోతున్నాడు. ఇప్పటికే విజయ్ నటించిన గీతగోవిందం, నోటా చిత్రాలు విడుదలయ్యాయి. గీత గోవిందం చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. త్వరలో టాక్సీవాలా చిత్రం విడుదల కాబోతోంది. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మరోమారు తన ప్రసంగంతో ఆడియన్స్ లో ఉత్సాహం రేపాడు.

ప్రసంగం ఆరంభంలోనే విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. బన్నీ అన్నలాగా తాను జీవితంలో డాన్స్ చేయలేను అని తెలిపాడు. బన్నీ అన్నలాగా డాన్స్ చేయాలంటే అది గ్రాఫిక్స్ తోనే సాధ్యం. తన చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైనందుకు బన్నీకి కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ సందర్భంగా విజయ్ మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నాడు. టాక్సీవాలా కోసం పనిచేసిన ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి వారి కష్టాన్ని వివరించాడు. సంగీత దర్శకుడు జాక్స్ గురించి మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆ బాధని తట్టుకుని ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడని విజయ్ ప్రశంసించాడు.

హీరోయిన్ ప్రియాంక జావాల్కర్ ని పరిచయం చేస్తూ.. ప్రియాంక అనంతపూర్ పిల్ల. యాక్టర్ అవుదామని హైదరాబాద్ కు వచ్చింది. హాస్టల్ లో ఉంటూ మూడేళ్ళుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రియాంక ఎంపికకాగానే ఆమెలో సంతోషం చూశానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ చిత్రం పైరసీకి గురికాబడిందని తెలిసి ఏడ్చేసింది. ఎట్టకేలకు సినిమా విడుదలవుతుండటంతో మళ్ళీ సంతోషంగా ఉందని విజయ్ తెలిపాడు.