నటాషాతో డేటింగ్ చేస్తున్నా... వరుణ్ ధావన్

Posted on : 12/11/2018 08:03:00 pm


బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ ఓ నిజాన్ని తన నోటి ద్వారానే వెల్లడించాడు. ఇంతకాలం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌తో ఆయన కొనసాగిస్తూ వచ్చిన బంధంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను నటాషాతో డేటింగ్ చేస్తున్నానని, ఆమెను పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు.

'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో భాగంగా, హోస్ట్ కరణ్ జోహార్‌తో మరో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో కలిసి వరుణ్ ధావన్ పాల్గొన్నాడు. ఇందులో వరుణ్ ధావన్ మాట్లాడుతూ, 'నేను నటాషాతో డేటింగ్ చేస్తున్నా. మేమిద్దరం పర్ఫెక్ట్ కపుల్. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా' అంటూ వెల్లడించాడు.

కాగా, వరుణ్ చిన్నప్పటి స్నేహితురాలైన నటాషా.. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ సందర్భంలో నటాషా గురించి మాట్లాడిన వరుణ్.. ఆమె తనను చాలా అర్థం చేసుకుంటుందని, తనకు మంచి పార్ట్‌నర్ అని తెలిపిన విషయం తెలిసిందే.