బెంగుళూరు వాసులు అధిక పుస్తకప్రియులు

దేశంలో ఎక్కువమంది పుస్తకప్రియులు బెంగుళూరులో ఉన్నారని అమెజాన్ ఇండియా వెల్లడించింది. 2017 సంవత్సరానికి గాను వార్షిక రీడింగ్ ట్రెండ్స్ నివేదికను సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ముంబై, ఢిల్లీ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే పరీక్షాసన్నద్ధ పుస్తకాలను ఎక్కువ మంది కొన్నారని, వాటిలో ఎక్కువగా ఇండియన్ పాలిటీ (ఐదో సంచిక) పుస్తకం మొదటి స్థానంలో ఉందని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ నూర్ పటేల్ తెలిపారు.
ఇక ఎక్కువమంది కొన్నవాటిలో రెండో స్థానంలో ఫిక్షన్ రచనలు, మూడో స్థానంలో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నిలిచాయి. అమెజాన్ వెల్లడించిన వివిధ కేటగిరీ జాబితాల్లో సీతా- వారియర్ ఆఫ్ మిథిలాస, వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాగే గతేడాది బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన చేతన్ భగత్ వన్ ఇండియన్ గర్ల్ పుస్తకం ఈ ఏడాది కూడా టాప్ 10 పుస్తకాల్లో నిలిచినట్లు అమెజాన్ ఇండియా నివేదిక పేర్కొంది.