పురంధేశ్వరికి గట్టి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత యామిని సాధినేని

Posted on : 12/11/2018 08:11:00 pm


ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్ నర్సింహ రావులపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగిన రాపెల్ కుంభకోణంపై బీజేపీ నేతలు మాట్లాడాలని చెప్పారు.

అలాగే ఏపీకి కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఎన్ని నిధులు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తుపై పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. అసలు పురంధేశ్వరి ఏ పార్టీ నుంచి వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కోసం రూ.3వేల కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని యామిని అన్నారు. అప్పుడు మాట్లాడని జీవీఎల్, ఏపీ అభివృద్ధికి ఖర్చు చేసి నిధులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఏపీకి ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ కూటమి ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమను గద్దె దించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటయ్యే కూటమితో నష్టం లేదన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో ఎలా జతకడుతోందని ప్రశ్నించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ అందరూ ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తాము కీలక శక్తిగా మారుతామని చెప్పారు. పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలపై యామిని కౌంటర్ ఇచ్చారు.