జగన్‌పై కత్తి దాడి మీద మంత్రి ప్రశ్నల వర్షం

Posted on : 12/11/2018 08:17:00 pm


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని, అందుకే సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా ఆడారని మంత్రి నక్కా ఆనంద్ బాబు సోమవారం విమర్శించారు. 

జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర పదిహేడు రోజుల విరామం, విశ్రాంతి తర్వాత ప్రారంభమైందని గుర్తు చేశారు. అంతకుముందు వారానికి ఐదు రోజులు పాదయాత్ర జరిగేదన్నారు. కోడి కత్తి దెబ్బకు ఇన్ని రోజులు ఆగిపోయాయని చెప్పారు.

విశాఖపట్నంలో అర సెంటీమీటర్‌ ఉన్న కోడికత్తి గాయం హైదరాబాద్‌ వెళ్లేసరికి 4 అంగుళాలు, తొమ్మిది కుట్లకు చేరుకుందని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంత గాయం అయితే బ్లీడింగ్‌ ఎలా ఆగిందో చెప్పాలని నిలదీశారు. అసలు విమానంలోకి ఆయనను ఎలా అనుమతించారని అడిగారు. హైకోర్టు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు.