నాటి విపత్తును కళ్లకు కట్టారు : ‘కేదార్‌నాథ్‌’ ట్రైలర్‌

Posted on : 12/11/2018 08:23:00 pm


ఉత్తరాఖండ్ విపత్తును తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న నాటి ప్రళయం యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. 2013 నాటి ఈ విపత్తు నేపథ్యంతో ‘కేదార్‌నాథ్’ సినిమా తెరకెక్కింది. ఇందులో ‘ధోనీ’ ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. 

అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో సుశాంత్ కేదార్‌నాథ్‌‌లో భక్తులను మోసుకెళ్లే ముస్లిం యువకుడిగా, సారా హిందూ యువతిగా కనిపించారు. ఒక వైపు భయంకర విలయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే.. మరోవైపు అందమైన ప్రేమ కథతో సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఈ ట్రైలర్ రూపొందించారు. 

కేదార్‌నాథ్‌లో భక్తుల సమస్య గురించి సున్నితంగా ప్రస్తావిస్తూ.. ఈ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత సుశాంత్, సారాల మధ్య ప్రేమ.. తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. ‘‘మన ప్రేమను ఎవరూ అంగీకరించరు’’ అని సుశాంత్ చెప్పే డైలాగ్‌కు ‘‘పోనీ నువ్వు అంగీకరిస్తావా?’’ అని అడుగుతుంది. సుశాంత్ ఆమె ప్రశ్నకు స్పందించకుండా వెళ్లిపోతాడు. ప్రళయం వచ్చినా సరే మిమ్మల్ని కలవనివ్వమని సారా తండ్రి ఆమెను తీసుకెళ్తాడు. అయితే, తాను రాత్రిబంవళ్లు తపస్సు చేస్తానంటోంది. ఈ సందర్భంగా భారీ వరద కేదార్‌నాథ్‌ను ముంచెత్తుతుంది. ఈ సన్నివేశాలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ట్రైలరే ఇంత థ్రిల్లింగ్‌గా ఉంటే.. సినిమా మరింత రక్తికట్టించవచ్చని నెటిజన్స్ అంటున్నారు.