గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా

Posted on : 13/11/2018 07:50:00 pm


ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి మంగళవారం బెయిల్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందారు. ఆంబిడెంట్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి షాక్ కు గురైనాడని సమాచారం.

ఆండిడెంట్ చీటింగ్ కేసులో శనివారం మద్యాహ్నం నుంచి ఆదివారం మద్యాహ్నం వరకు గాలి జనార్దన్ రెడ్డిని దాదాపు 24 గంటల పాటు సీసీబీ పోలీసులు విచారణ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సీసీబీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

గాలి జనార్దన్ రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. కేంద్ర మంత్రి అనారోగ్యంతో మరణించడంతో ప్రభుత్వం కోర్టులకు సోమవారం సెలవు ప్రకటించింది.

గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు బెంగళూరులోని 1వ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుతో, ఆ కంపెనీ నిర్వహకుల డీల్ తో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో వాదించారు.