సొనాలి బింద్రే మళ్లీ ఎమోషనల్..

Posted on : 13/11/2018 08:54:00 pm


అందాల నటి సొనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధిన పడ్డారనే విషయంతో సినీ వర్గాలు, అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం చికిత్స పొందుతున్నారు. గత కొద్దికాలంగా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో భావోద్వేగమైన పోస్టులతో ఆకట్టుకొంటున్న సొనాలి బింద్రే తాజాగా మరో ఎమెషనల్ పోస్టును పెట్టారు. తన భర్త గోల్డీ బెహల్‌తో 16 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గురించి తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే. .

సుదీర్ఘమైన దాంపత్య జీవితానికి సంబంధించిన జర్నీని తెలిపే కొన్ని కీలకమైన ఫొటోలను సొనాలి బింద్రే పోస్ట్ చేశారు. గోల్డి బెహల్ గురించి చెబుతూ.. నా భర్త. నా భాగస్వామి. నాకు మంచి స్నేహితుడు. నా కోసం బలంగా నిలబడే శక్తిమంతమైన గోడ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
మా అమూల్యమైన జీవితం గురించి రాయాలంటే పెన్ను కదలడం లేదు. ఎక్కడ మొదలు పెట్టాలో అనే విషయం అర్ధం కాక సతమతమవుతున్నాను. మా పెళ్లి గురించి ఆలోచిస్తే బుర్ర నిండా అనేక ఆలోచనలు పరుగులు పెట్టాయి. పెళ్లంటే సుఖం, దుఖం, మంచి చెడుల్లో ఒకరికొకరిగా నిలువడమేనని ఈ ఏడాది మాకు చెప్పింది.

క్యాన్సర్ అంటే ఏ ఒక్క వ్యక్తికి సోకిన వ్యాధిగా చూడకూడదు. ఆ వ్యాధికి ఎవరైనా గురైతే.. మొత్తం కుటుంబానికి క్యాన్సర్ సోకినంత పని అవుతుంది. నా విషయంలోను అదే జరిగింది. నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటూ.. రెండు దేశాల మధ్య గోల్డీ పెట్టిన పరుగు మాటల్లో వ్యక్తీకరించలేనిది.

నేను ఎలాంటి స్థితిలో ఉన్నా నాకు అండగా నిలిచి మనోధైర్యాన్ని కల్పించావు. ఆనందాన్ని, ప్రేమను పంచిపెట్టావు. నా జీవితపు ప్రతీ అడుగులోనే నీవే కనిపించావు. నన్ను ఇంతగా అర్ధం చేసుకొన్నందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని సొనాలి బింద్రే ట్వీట్ చేశారు.