నేను మనిషిని...

Posted on : 09/01/2018 01:36:00 am

ఎనబై నాలుగు కోట్ల జీవరాసులలో నీదే అత్యుత్తమ జన్మని గడ్డాలు పెంచిన సాములోరు ఉపన్యసిస్తే, రొమ్ములిరుచుకొని “నిజమే!” అని గర్వంతో విర్రవీగాను.

"నిజమే మరి!
మనిషికి మాత్రమే ఆత్మహత్యలు,
మనిషికి మాత్రమే ఇన్ని రకాల మానసిక రోగాలు, మనిషి మాత్రమే కష్టపడి, కష్టంలేని జాబు తెచ్చుకొని, ఆ జీతాన్ని ఆసుపత్రులకు కడుతున్నాడు,
మనిషి మాత్రమే తన తోటి మనుషుల అభిప్రాయాలకు మానసిక బానిసై తనను తాను హింసించుకోగలడు" అని ఎవరైనా సటైర్లేస్తే, నువ్వు నెగటివ్ మాత్రమే చూస్తున్నావు, అయినా ఇవన్నీ జరుగుతున్నట్టు వేదాల్లోనూ, గీతలోనూ లేదే! అని వాదించి నన్ను నేనే మోసం చేసుకోగల సిద్దహస్తుడిని.
ఎందుకంటే మనిషిని నేను.

జంతువులను,పక్షులను, చేపలను,మొక్కలను మనిషి అవసరాలకోసమే దేవుడు సృష్టించాడని సువార్త సభల్లో బిషప్ గారు నొక్కివక్కాణిస్తే, ఏ గిల్టీ ఫీలింగు లేకుండా ఈ భూమి పైన జీవరాశి మొత్తాన్ని నా అవసరం కోసం వాడేసుకోవడానికి హోలీ పర్మిషన్ దొరికిందని పొంగిపోతాను.

మరి దోమలు,పేలు, నల్లుల కోసం మనుషులను సృష్టించాడా దేవుడు! అని ఎవడైనా అడిగితే నీది వితండవాదం. అలాగని పరిశుద్ధ గ్రంధంలో లేదని అరుస్తాను. కానీ తరువాత "ఈ దోమల గోలేంటబ్బా?" అని బుర్ర గోక్కుంటాను.
ఎందుకంటే మనిషిని నేను

ఈ జీవితం దేవుడు నీకు పెట్టిన పరీక్ష. ఆ పరీక్ష పాసవ్వడానికే, దేవతలకు కూడా లేని ఫ్రీ విల్ (స్వయం నిర్ణయాదికారం) దేవుడు నీకిచ్చాడు. మానవ జన్మ దేవతల కంటే ఉన్నతమైనది అని జాకీర్ నాయక్ చాప్టర్ నంబర్లు, వెర్స్ నంబర్లు మాటలునేర్చిన చిలుకలా అప్పజెప్పుతూ, ఇదే వేదాల్లోనూ, బైబిల్లోనూ కూడా ఉందని నొక్కి వక్కాణిస్తే “ఆహా మేము దేవతల కంటే గోప్పోళ్ళమ”ని మురిసిపోతాము.

“ఏక్సిడెంట్ లో,బాంబు దాడుల్లో, సోమాలియా ఆకలి మరణాల్లో చిన్న పిల్లలందరూ చనిపోతే వాళ్ళు దేవుని పరీక్ష ఎలా పాసవుతారు? అయినా మా ఫ్రీ విల్ ని మా ఇంటి దగ్గర తల్లిదండ్రులు , మదరసాలలో మీరూ, టీవీలో మీడియా వాళ్ళూ ముందే రెడీమేడ్ గా తయారు చేసేస్తుంటే ఇంకెక్కడ ఫ్రీవిల్ నా బొంద .” అని ఎవడైనా అడిగితె, ఇవన్నీ జరుగుతున్నట్టు ఖురాన్ లో లేదంటాను.
ఎందుకంటే మనిషిని నేను.

పేస్ బుక్ లో పోస్టులకు ,ఫోటోలకు లైకులు, నువ్వు అపర మేదావివని కామెంటులొస్తే ‘ఆ..హా నేను సూపరెహే” అని మనసులో ఉబ్బితబ్బియ్ పోయి ,పైకి మాత్రం హంబుల్ కటింగిస్తాను.

ఒక మంచి ఫోటో రావడానికి ముందు నేను తీసి ఎవ్వరికీ చూపించకుండా డిలీట్ చేసిన వందల ఫోటోలను, మంచి కవితో ,పోస్టో రాయడానికి ముందు డస్ట్ బిన్ లోకెల్లిన పనికిమాలిన చెత్త ఆలోచనలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. “నేను కాని నేను”ను ప్రపంచానికి చూపించి మాయ చేస్తాను.
ప్రపంచాన్ని నమ్మించగలుగుతున్నాను గానీ నిజం నాకు తెలియకపోతుందా . అయినా సరే నన్ను నేనే నమ్మించుకోవడానిని ప్రయత్నిస్తూనే ఉన్నాను.
ఎందుకంటే నేను మనిషిని.

నాగురించి నేనే రాసుకుంటాను. నన్ను నేనే పొగుడుకుంటాను.
రాజుల చరిత్ర రాజులకు అనుకూలంగా రాజులే రాసుకున్నారని అప్పుడప్పుడూ అరుస్తాను.
కానీ మనిషికి సమస్య అయ్యేదే తప్పు, మనిషికి ఉపయోగపడేదంతా ఒప్పే అన్నట్టు, విలువలన్నింటినీ నాకు అనుకూలంగానే రాసేసుకున్నాను. ఈ భూమి మనిషిది మాత్రమే కాదు జంతుకోటిది కూడా అన్న విషయాన్ని చాలా కన్వీనియెంట్ గా పక్కనపెట్టేసేనన్న విషయాన్ని మరచిపోతాను(??!!!).
ఎందుకంటే బేసిక్ గా నేను మనిషిని.

- రాంబాబు తోట