తల్లిని ప్రేమించనివాడి ప్రేమను నమ్మలేం

Posted on : 09/01/2018 04:43:00 pm

భర్తకు విడాకులతో సౌదీ మహిళ సంచలనం

యువతి నిర్ణయాన్ని అభినందించిన న్యాయస్థానం

భర్త నుంచి విడాకులు కోరుతూ ఓ సౌదీ యువతి చెప్పిన కారణం.. యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ‘నా భర్త అతని తల్లి కంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వెంటనే అతడి నుంచి నాకు విడాకులు ఇప్పించండి’ అంటూ ఆమె వేసిన పిటిషన్‌ సౌదీ కోర్టును కూడా ఆలోచనలో పడేసింది. తాను ఎంతో ప్రేమించిన భార్య ఇలా చేసినందుకు 29 ఏళ్ల ఆమె భర్త షాక్‌ అయ్యాడు. ‘నీతో బంధం కోసం ఏదైనా చేస్తాను.

నన్ను విడిచి వెళ్లకు’ అని కోర్టులోనే బతిమాలాడు. కానీ ఆ యువతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘తన తల్లిని మించి భార్యను ప్రేమించే మగాడిని నేను నమ్మను. నేను ఏం కోరినా క్షణాల్లో తెచ్చి ఇచ్చాడు. నా కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. విదేశాల్లో తిప్పాడు. కానీ తన తల్లి చిన్నచిన్న ఆశలు కూడా నెరవేర్చలేదు. అలాంటివాడ్నీ నేను ఎలా నమ్మగలను? తల్లినే ప్రేమించని వాడు..నన్ను మాత్రం ఎంతకాలం ప్రేమిస్తాడు? రేపు ఇంకో అమ్మాయి వెంటపడడని గ్యారంటీ ఏమిటి? అందుకే నాకు విడాకులు ఇప్పించండి’ అని ఆ యువతి స్పష్టం చేసింది.

‘తల్లిని చూడని కొడుకు ఎప్పటికీ మంచి భర్త కాలేడు’ అంటూ పెళ్లి సమయంలో అతను ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేసింది. ఆమె మాటలను అభినందించిన న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. ‘ఓ అమ్మాయి కోసం కన్నతల్లినే మరచిపోయినవాడిని ఎప్పటికీ నమ్మలేం. కనీ, పెంచి, పెద్దచేసిన తల్లికే కుటుంబంలో అగ్రస్థానం ఇవ్వాలి. అమ్మప్రేమకు ఎవ్వరూ సాటిరారు.’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘తల్లిని ప్రేమించనివాడు..భార్యపై చూపేది కపట ప్రేమే’ అని నినదించిన సౌదీ మహిళ తెగువకు ప్రపంచం సలామ్‌ చేస్తోంది.