రేవంత్ రెడ్డి అరెస్టుపై రాహుల్ గాంధీ ట్వీట్

Posted on : 04/12/2018 06:13:00 pm


తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.

''అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్ట్. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు'' అని రాహుల్ ట్వీట్ చేశారు.

కొడంగల్‌లో బంద్‌ ప్రకటన విరమించుకుని, నిరసన కార్యక్రమాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి చేపట్టారని.. అది కూడా కేసీఆర్ బహిరంగ సభ జరుగుతున్న కోస్గి పట్టణం వెలుపల అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు.

కొడంగల్‌లో కేసీఆర్ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి అరెస్టు ఘటనలపై టీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు స్పందించారు.

''తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాహుల్ గాంధీ ప్రచారం చేయాలని మహాకూటమి కోరుకుంటుంది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆపేందుకు ప్రయత్నిస్తారా'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

''ఎన్నికల సమయంలో ఈసీయే సుప్రీం అథార్టీ. సీఎం కొడంగల్ మీటింగ్‌ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించటంతో.. (రేవంత్ రెడ్డి) ముందస్తు అరెస్టుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది'' అని కేటీఆర్ పేర్కొన్నారు.