కర్ణుడి పాత్రలో.. విక్రమ్‌

Posted on : 04/12/2018 06:54:00 pm


దర్శక, నిర్మాతల చూపు ఇప్పుడు చారిత్రాత్మక సినిమాలపై పండింది. 'బాహుబలి' తర్వాత ఈ కోవలో పలు సినిమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 'సైరా నరసింహారెడ్డి', 'మణికర్ణిక' సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. మరోపక్క చారిత్రాత్మక కథతో 'సంగమిత్ర' సినిమాను తీసేందుకు దర్శకుడు సి. సుందర్‌ సన్నాహాలు చేస్తున్నారు. కాగా విక్రమ్‌ కథానాయకుడుగా ఓ చారిత్రాత్మక సినిమా వస్తోందట. 'మహవీర్‌' అనే చిత్రంలో ఆయన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్రను విక్రమ్‌ పోషిస్తున్నారని తెలిసింది. మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన 'పొన్నియిన్‌ సెల్వన్‌' అనే నవల హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. జయం రవి ఇందులో మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు.

తమిళనాడులోని పద్మనాభ ఆలయంలో ఈ కార్యక్రమం జరిగిందట. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. విక్రమ్ తన తర్వాతి ప్రాజెక్టు షూటింగ్‌తో బిజీగా ఉండటంతో పూజా కార్యక్రమానికి వెళ్లలేదట. మలయాళ నటుడు సురేశ్‌ గోపి, ఉన్నికృష్ణన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా కోసం నిర్మాతలు పెద్ద గంటను కూడా కొన్నారు. దాన్ని కర్ణుడి 30 అడుగుల రథానికి ఉంచనున్నారట. అంతేకాదు ఈ సినిమాను రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.