పోలింగ్‌కు తెలంగాణ సర్వం సిద్ధం...

Posted on : 06/12/2018 01:16:00 pm


తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచార పర్వానికి బ్రేకులు పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి ఆయా పార్టీలు ప్రచారంలో బిజిబిజీగా గడిపాయి. ఇక ఎన్నికల ప్రక్రియలో పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యాక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ ) 2018-19కి గాను రూ.8.43 లక్షల కోట్లుగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 66.54 శాతం ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి 988గా ఉంది. రాష్ట్రం ఏర్పాటు కాగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,36,776. డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌కు అధికారులు మొత్తం 32,574 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 

ఇక నియోజకవర్గాల సంఖ్య చూస్తే మొత్తం 119 ఉన్నాయి. ఇందులో జనరల్ 88 ఉండగా, ఎస్సీ స్థానాలు 19 , ఎస్టీ స్థానాలు 12 ఉన్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 అసెంబ్లీ స్థానాలు గెలువగా... కాంగ్రెస్ 21, టీడీపీ 15, మజ్లిస్ పార్టీ 7, బీజేపీ 5, ఇతరులు 8 సీట్లు గెలుపొందాయి. అత్యధిక సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు.