రెండు నెలల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెబుతా : పవన్ కళ్యాణ్

Posted on : 06/12/2018 01:39:00 pm


తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాస్తవాలు దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లరు, ప్రజా సమస్యలను పట్టించుకోరని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం నీచమైన చర్య అని చెప్పారు. 

నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో రెండు నెలల్లో చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అడుగుతున్నారని, ఫిబ్రవరిలోగా చెబుతానని చెప్పారు. తనను జగన్ ఒక్కడు గుర్తించపోయినంత మాత్రాన జనసేన లేనట్లుగా కాదని చెప్పారు. ఆయన చెప్పాడని జనసేనకు ఉనికి లేనట్లుగా తాము భావించడం లేదని తెలిపారు. తాము ఒక్క పిలుపు ఇస్తే జనసేన కవాతుకు లక్షలాది మంది వచ్చారని గుర్తు చేశారు. నిజంగా చాలామంది చెబుతున్నట్లు డబ్బు రాజకీయాలను ప్రభావితం చేసినట్లయితే 2014లో జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలని కానీ ధనబలం చూపే వారు కాదని చెప్పారు. 

అనంతపురం జిల్లాలో తన దృష్టికి పలు సమస్యలు వచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. రైతులు, చేనేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాయలసీమ నుంచి ఉపాధిలేక చాలామంది వలస పోతున్నారని చెప్పారు. కరువు నిర్మూలనకు శాశ్వత పరిష్కారం ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. యువత తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు పండించాలని చెప్పారు.